Share News

పంట పండింది!

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:59 PM

కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో రైతుల కష్టాలు తీరాయి. జిల్లాలో రైతులకు ఈ ఏడాది కాస్తా బాగుందనే చెప్పవచ్చు. ఈ ఏడాది అన్ని పంటలు బాగానే పండాయి.

 పంట పండింది!

రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ సొమ్ములు

వ్యవసాయానికి జవసత్వాలు

రైతు గ్రూపులకు కిసాన్‌ డ్రోన్‌లు.. ఉద్యాన పంటలకు చేయూత

బిందు సేద్యం అమలుతో మెట్ట ప్రాంత రైతులకు తీరిన కష్టాలు

24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు రైతుల ఖాతాల్లోకి.. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో రైతుల కష్టాలు తీరాయి. జిల్లాలో రైతులకు ఈ ఏడాది కాస్తా బాగుందనే చెప్పవచ్చు. ఈ ఏడాది అన్ని పంటలు బాగానే పండాయి. రైతులకు భరోసా ఇచ్చేలా అన్నదాత సుఖీభవ సొమ్ములు అందించారు. రబీ, ఖరీఫ్‌లలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు తీరాయి. ధాన్యం అమ్మిన 48 గంటలలోపు సొమ్ములు బ్యాంకుల్లో జమ అవుతున్నాయి. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వ్యవసాయ పంటలపై ప్రభావం అంతంత మాత్రంగానే పడింది. జిల్లాలో వ్యవసాయ సాగులో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన చేయూత, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ సారి మననం చేసుకుందాం.

(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వ్యవసాయ సాగు సజావుగా సాగుతోంది. జిల్లాలో గత రబీలో 2,02,000 ఎకరాల్లో రబీ పంటలు సాగు చేయగా ఇందు లో వరి సాగు 93 వేల ఎకరాల్లో సాగింది. ఎకరానికి 42 బస్తాలు (75 కేజీలు) దిగుబడు లు లభించాయి. మిగిలిన పంటల సాగు కూడా సజావుగా సాగింది. జిల్లాలో ఖరీఫ్‌లో 2,27,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఇందులో వరి పంట 2,10,000 ఎకరాల్లో సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా యి. రబీ సీజన్‌లో (2025–26) 2.38 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం చేయూత నివ్వడంతో రైతులు ఉద్యాన పంటల సాగుపై మొగ్గు చూపుతు న్నారు. ‘రైతన్న మీకోసం’ పేరిట వ్యవసాయ శాఖ సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి వారి ఇబ్బం దులను తెలుసుకోవడం రైతులకు ఎంతో మేలు కలుగుతోంది.

అన్నదాత సుఖీభవ సొమ్ములు జమ

రైతులకు భరోసా గా ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి ఇప్పటికే రెండు విడత లుగా ఒక్కొక్క రైతుకు రూ.14 వేలు అందించిం ది. ఈ నిధులలోనే పీఎం కిసాన్‌ సొమ్ములను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆగస్టు 2వ తేదీన లక్షా 60,968 మంది రైతులకు అన్న దాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను జిల్లా మొత్తం మీద రూ.107.08కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ. 80.48 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ. 26.59 కోట్లు అందించారు. రెండో విడతగా నవంబరులో 1,60,968 మంది రైతు లకు అన్నదాత సుఖీభవ నిధులు రూ.80.48 కోట్లు, పీఎం కిసాన్‌ నిధులు రూ. 25.75 కోట్లు మొత్తం రూ. 106.23 కోట్లు జమ చేసింది. మొదటి విడతగా రూ.7 వేలు, రెండవ విడతగా రూ.7వేలు రైతులకు అందజేశారు. మిగిలిన సొమ్ములు రూ.6 వేలు వచ్చే నెలలో రైతులకు అందిస్తారని తెలుస్తోంది.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం సొమ్ములు చెల్లింపులో రైతు లకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. రబీ, ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొను గోళ్లు చేయడమే కాకుండా రైతులకు 24 గంట ల్లోపు చెల్లింపులు జరగడంతో రైతులలో ఆనం దం వెల్లివిరిసింది. 2024–25 రబీలో 20,526 మంది రైతుల నుంచి 2,52,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.582 కోట్లు చెల్లించారు. 2025–26 ఖరీ ఫ్‌లో ఇప్పటివరకు 40,739 మంది రైతుల నుంచి రూ.785.04 కోట్లు విలువైన 3,46,074 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 24 గంటలల్లోపే ధాన్యం సొమ్ములు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి.

రైతులకు ప్రోత్సాహకాలు

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు రూ.3.50 కోట్లు విలువైన పవర్‌ ట్రిల్లర్లు, రోటో వీటర్లు, స్ర్పేయర్లు, ట్రాక్టరు కల్టివేటర్లు, నాగళ్లు సబ్సిడీపై అందజేశారు. కొత్తగా కిసాన్‌ డ్రోన్‌ టెక్నాలజీని తీసుకువచ్చి రూ. 5.20 కోట్లతో 52 రైతు గ్రూపులకు కిసాన్‌ డ్రోన్‌లు సబ్సిడీపై అందించడమే కాకుండా 52 మంది పైలెట్లుకు శిక్షణ ఇచ్చారు. ఉద్యాన పంటలకు రాయితీలు ఇవ్వటమే కాకుండా జిల్లాలో కొత్తగా కోకో పంటలో నాణ్యత పెంచ డం కోసం ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా 4 మోడల్స్‌లో జిల్లాలో కోకో రైతులకు వివిధ ఉపకరణాలను అందించడానికి రూ.2.13 కోట్లు మంజూరు చేశారు. ఆయిల్‌ పామ్‌కు ధర పెరగడం, ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో చాలామంది రైతులు పామాయిల్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మెట్ట మండలాల్లో రైతులకు ప్రోత్సాహాన్ని కల్పించేలా బిందుసేద్యం, తుంపర్ల సేద్యానికి రాయితీలు ఇచ్చారు. ఈఏడాది బిందు సేద్యానికి 4,800 హెక్టార్లకు సంబంధించి 12 వేల మంది రైతులు రిజిస్టరు చేసుకున్నారు. ఇందులో 48 హెక్టార్లలో తుంపర్ల సేద్యానికి దరఖాస్తు చేసుకున్నారు.

కౌలు రైతులకు చేయూత

జిల్లాలో 75 వేల కౌలు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఇప్పటి వరకు 64 వేలు కౌలు రుణ అర్హత కార్డులను మంజూరు చేసింది. వారికి రూ.110 కోట్లు రుణాలుగా అందించారు. కౌలు రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ నిధులు అందక పోవడం గమనార్హం. అయితే వీరికి అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

జూలై, ఆగస్టు నెలల్లో మందగించిన వర్షాలు

జిల్లాలో ఈ ఏడాది రెండు నెలలు అంటే జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కొంత మందగించాయి. అయితే సెప్టెంబరులో వరుస అల్పపీడనాలు ప్రభావం వల్ల సాఽధారణం కంటే మించి వర్షాలు కురియడంతో వ్యవసాయం గట్టెక్కింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీమీటర్లు కాగా 182.1 మిల్లీ మీటర్లు , జూలైలో సాఽధారణ వర్షపాతం 242.1 మిల్లీ మీటర్లు కాగా 187.9 మిల్లీ మీటర్లు (మైనస్‌ 22.4శాతం) , ఆగస్టులో సాధారణ వర్షపాతం 239.4 మిల్లీ మీటర్లు కాగా 237 మిల్లీ మీటర్లు (మైనస్‌ 2.4శాతం), సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 172.5 మిల్లీ మీటర్లు కాగా 197.9 మిల్లీ మీటర్లు వర్షపాతాలు నమోదయ్యాయి.

మొంథా తుఫాను ఎఫెక్ట్‌

అక్టోబరు చివరి వారంలో మొంఽథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 14,110 ఎకరాల్లో వరి, మినుము పంటలకు సంబంధించి 11,574 మంది రైతులకు రూ.13.26కోట్లు పంట నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు 44 ఎకరాల్లో రూ.56 లక్షల నష్టం వాటిల్లింది.

యూరియా కష్టాలు

ఈ ఏడాది రబీ, ఖరీప్‌ సీజన్‌లలో యూరియా కష్టాలు ఎదురయ్యాయి. రైతులు యూరియా కోసం రోడ్డెక్కిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించడంతో యూరియా కష్టాలను తీరాయి. రైతులకు సకాలంలో యూరియాను అందించడమే కాకుండా యూరియా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా నియంత్రించగలిగారు. ప్రస్తుత రబీ సీజన్‌లో యూరియా కష్టాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో నానో యూరియా, నానో డీఏపీ వంటి సంప్రదాయ ఎరువులు వినియోగించాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయం బంగారు పంటగానే కొనసాగింది. రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో రైతుల్లో వ్యవసాయ పంటల సాగు గిట్టుబాటు అవుతుందనే నమ్మకం కలిగింది.

ఆక్వా రంగంలో ఒడిదుడుకులు

నిడమర్రు : ఆక్వా రంగం 2025 ఒడుదుడుకలతో సాగింది. 2020 నుంచి తీవ్ర ఒత్తిడులతో సాగు తున్న ఆక్వా రంగం అమెరికా ట్రంప్‌ దెబ్బకు మరింత దిగ జారింది. చేపల మార్కెట్‌ పరిస్థితి సమీక్షిస్తే రూప్‌చంద్‌ ధర ఈ సంవత్సరం జనవరిలో కేజీ రూ.110 ఉండగా జూన్‌ నాటికి దీని ధర రూ.100లకు చేరింది. జూన్‌ నాటి నుంచి ధర తగ్గుతూ వచ్చి ప్రస్తుతం కేవలం 82–83 రూపాయలు మాత్రమే పలకడంతో చేపల రైతుల ఢీలా పడ్డారు. ఈ రేటులో చేపలు అమ్ముకుంటే నష్టాలు వస్తా

యని రైతుల ఆందోళన చెందుతున్నారు. రూ.కేజీ 95లకు అమ్మితే కాస్తా గిట్టుబాటు అవుతుందని వాపోతున్నారు. మరోవైపు రొయ్యల పరిస్థితి ఈ ఏడాది మరింత దయనీయంగా మారింది. 2025 జనవరిలో 100 కౌంట్‌ ధర రూ.265 ఉండగా ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలు విధించడంతో ఒక్కసారిగా 100 కౌంట్‌ రూ.210 పడిపోవడంతో రైతు గుక్కతిప్పుకోలేక పోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితి దాపురించింది. ఈలోగా జూన్‌ నుంచి నవంబర్‌ నాటి వరకు ఒక్కో చెరువు రెండు నుంచి మూడుసార్లు వైరస్‌ వల్ల నష్టాలతో పట్టుబడులు పట్టాల్సి వచ్చింది. డిసెంబరులో చెరువులలో సరుకులు లేకపోవడం వల్ల రొయ్య రేటు కాస్త పెరి గింది. నేడు రేటు 100 కౌంట్‌ రూ.250 పలుకుతున్నా ఎవ్వరి దగ్గర సరుకు లేకుండా పోయింది.

Updated Date - Dec 28 , 2025 | 11:59 PM