Share News

సచివాలయం తలుపులు మూసి.. ఖాళీ బిందెలతో ఆందోళన

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:16 AM

రమణక్కపేట ఎస్సీ కాలనీ మహి ళలు తాగునీటి కోసం సచివాలయం తలుపులు మూసివేసి బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.

సచివాలయం తలుపులు మూసి..   ఖాళీ బిందెలతో ఆందోళన

రమణక్కపేట సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు

ముసునూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): రమణక్కపేట ఎస్సీ కాలనీ మహి ళలు తాగునీటి కోసం సచివాలయం తలుపులు మూసివేసి బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలోని పంచాయతీ బోరులో విద్యుత్‌ మోటారు మరమ్మతుకు గురై ఇరవై రోజులు అయిందని, తాగు నీటితో పాటు కనీస అవసరాలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. సమస్యను సర్పంచ్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. తాగునీరు ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. దీంతో సచివాలయ సిబ్బంది సమస్యను ఎంపీడీవో బీ.ఏ సత్యనారాయణకు తెలిపారు. రెండు రోజుల్లో మోటారు బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఉన్న మంచినీటి బోరును ఎంపీడీవో పరిశీలించి కార్యదర్శి సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటారును బిగించే వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

Updated Date - Jul 10 , 2025 | 12:16 AM