ఏపీనిట్ సూపర్ హిట్
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:53 PM
ఏపీ నిట్‌లో సీట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా జేఈఈలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ సారి ఏపీ నిట్‌లో చేరుతున్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆసక్తి
480 సీట్లకు అడ్మిషన్‌లు..
455 మందికి కేటాయింపు
ఆరో విడత కౌన్సెలింగ్‌లో మరికొందరు చేరే అవకాశం
తదుపరి స్పాట్ కౌన్సెలింగ్
నాటికి మొత్తం సీట్లు భర్తీ
సీఎస్‌ఈలో గత ఏడాది
పది వేల ర్యాంకుతో ప్రారంభం
ఈ ఏడాది తొమ్మిది వేల నుంచే..
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ నిట్)లో సీట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా జేఈఈలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ సారి ఏపీ నిట్‌లో చేరుతున్నారు. గత ఏడాది సీఎస్ ఈలో 10 వేల ర్యాంక్ నుంచి అడ్మిషన్లు ప్రారంభమైతే.. ఈ ఏడాది తొమ్మిది వేల ర్యాంక్ నుంచే అడ్మిషన్లు తీసుకున్నారు. వాస్త వానికి 750 సీట్లకు చేరిన నిట్ ఫ్యాకల్టీ లేద ని, హాస్టల్ సౌకర్యం తక్కువగా ఉందంటూ 480 సీట్లకే పరిమితం చేసేశారు. రెగ్యులర్ డైరెక్టర్ నియామకం జాప్యంతో కేంద్రం నుంచి నిధులు మంజూరులోనూ వెనుకబడిం ది. రూ.400 కోట్లతో అభివృద్ధికి పంపించిన పెండింగ్‌లో ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ నియామకం చేపట్టలేకపోతున్నారు. ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ నిట్‌ను సందర్శించడం గగనమైంది. సాధారణ పాలనాపరమైన అంశాలకే ఇన్ ఛార్జ్ డైరెక్టర్ పరిమితమవుతున్నారు. దీనివ ల్ల నిట్ పురోగతి మందగిస్తోంది. డైరెక్టర్ నియామకం జరిగితే నిట్ మళ్లీ గాడిన పడుతుంది. సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఒక దశలో ఏపీ నిట్ దక్షిణాదిలోనే నెంబర్–1 విద్యా సంస్థ అవార్డుకు ఎంపికైంది. అటువం టిది ఇప్పుడు సీట్లు కుదించే పరిస్థితికి వచ్చేసింది. అయినా సరే ప్లేస్‌మెంట్స్‌లో తన స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తోంది. నిట్ లో అన్ని వసతులు బాగున్నాయంటూ విద్యా ర్థులు సంతృప్తి చెందుతున్నారు. డైరెక్టర్ లేక పోవడం ఒక్కటే సమస్యగా ఉందని విద్యార్థు లు ఆందోళన చెందుతున్నారు. డైరెక్టర్ ఉంటే మంచి కంపెనీలను రప్పించి ప్లేస్‌మెంట్స్ కోసం మరింత కృషిచేస్తారు. కంపెనీలు ఆసక్తి చూపుతాయి. డైరెక్టర్ లేకపోవడంతో అంతర్జా తీయ స్థాయిలో పేరు పొందిన కంపెనీలు రావడం లేదు. ప్లేస్‌మెంట్స్‌లో ప్యాకేజీలు తగ్గిపోతున్నాయి.
ఫ్రీజింగ్ చేసుకుంటున్న విద్యార్థులు
దేశంలో ఐఐటీ, నిట్ సంస్థల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్‌లు కల్పిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నిట్‌లో సీట్లు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐదు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. నిట్‌లో 455 మంది అభ్యర్థులు తమ సీట్లను ఫ్రీజ్ చేసుకున్నారు. మరో 25 సీట్ల కోసం ఆరో రౌండ్‌లో విద్యార్థులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంపిక చేసుకున్న విద్యార్థులు తమకు అనువైన నిట్‌లో సీట్లు వేస్తే అక్కడ ఫ్రీజ్ చేసుకుంటారు. లేదంటే నిట్‌కే పరిమితమవుతారు. ఇతర నిట్‌లలో సీటు కోసం ఎంపికైన విద్యార్థులు నిట్ తమకు అనుకూలమని భావిస్తే ఆరో రౌండ్‌లో ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. అప్పటికీ నిట్‌లో సీట్లు మిగిలితే జోసా కౌన్సెలింగ్ ద్వారానే రెండు రౌండ్‌లు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలే అవకాశం లేదు. గతంలో స్పాట్ కౌన్సెలింగ్ లేకపోవడంతో సీట్లు భర్తీ కాలేదు. ఐఐటీ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్పాట్ కౌన్సెలింగ్ అమలు చేస్తున్నారు. ఫలితంగా ఐఐటీ, నిట్ సంస్థల్లో వంద శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. నిట్‌కు ఈ ఏడాది విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉంటోంది.