Share News

అనర్హుల చెంతకు ‘ఆదరణ–2’ పనిముట్లు

ABN , Publish Date - May 21 , 2025 | 12:29 AM

కులవృత్తితో జీవనం సాగించే పేదలకోసం ప్రభుత్వం చేపట్టిన ఆదరణ–2 పథకం యూనిట్లు చేతులు మారాయి. తమ వాటా సొమ్ము చెల్లించి, పనిముట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది.

అనర్హుల చెంతకు ‘ఆదరణ–2’ పనిముట్లు
మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముక్కంటి

2018–19లో వైసీపీ కార్యకర్తల చేతుల్లోకి లబ్ధిదారుల యూనిట్లు

ఎమ్మెల్యే చింతమనేని ఫిర్యాదు.. కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ

పెదవేగి, మే 20(ఆంధ్రజ్యోతి): కులవృత్తితో జీవనం సాగించే పేదలకోసం ప్రభుత్వం చేపట్టిన ఆదరణ–2 పథకం యూనిట్లు చేతులు మారాయి. తమ వాటా సొమ్ము చెల్లించి, పనిముట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. అసలు లబ్ధిదారులను పక్కనబెట్టి, కొందరు వ్యక్తులు ఆ యూనిట్లను చేజిక్కించుకున్నారు. దీనిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఫిర్యాదుతో, కలెక్టర్‌ వెట్రిసెల్వీ ఆదేశాలతో పెదవేగి మండలంలో పలుగ్రామాల్లో మంగళవారం క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటి, బీసీ వెల్ఫేర్‌ అధికారిణి ఆర్‌.నాగరాణి, జిల్లా పరిషత్‌ సీఈవో భీమేశ్వరరావులతో కూడిన త్రీమెన్‌ కమిటీ పెదవేగి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణలో అసలు లబ్ధిదారులను పక్కనబెట్టి, మధ్యలో అనర్హులైన వారికి వైసీపీ నాయకులు ఆదరణ–2 పనిముట్లను పంపిణీ చేసినట్లు తెలుసుకున్నారు. 2018–19 ఏడాదికి సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ–2 పథకానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని, వారి వాటాసొమ్ము డీడీల రూపంలో చెల్లించారు. యూనిట్లు మంజూరై, పనిముట్లు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి. ఈలోగా ఎన్నికలకోడ్‌ అమలులోకి రావడంతో పనిముట్లను లక్ష్మీపురంలోని దెందులూరు మార్కెట్‌ యార్డులో భద్రపర్చారు. అనంతరం ప్రభుత్వం మారడంతో వైసీపీ నాయకులు ఆ పనిముట్లను అసలు లబ్ధిదారులను కాదని, తమకు కావలసినవారికి పనిముట్లను అప్పజెప్పినట్లు విచారణలో గుర్తించారు. మొత్తం 132 యూనిట్లను అనర్హులైన 82మందికి పంపిణీ చేసినట్లు గుర్తించి, వాటిపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విచారణ పూర్తిచేసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ భీమేశ్వరరావు తెలిపారు. ఈ విచారణలో త్రీమెన్‌ కమిటీతోపాటు పెదవేగి ఎంపీడీవో పి.శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:32 AM