అప్పుల భారం వద్దు!
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:14 AM
గ్రామీణ బ్యాంక్‌గా సహకార రంగంలో ఒక వెలుగు వెలిగిన ఆచంట మృత్యుంజయ విశాల పరపతి సంఘంపై పైలట్ ప్రాజెక్ట్ పేరుతో అప్పుల భారం మోపవద్దని సభ్యులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు.

ఆచంట సహకార సంఘానికి రూ.2.14 కోట్ల కేంద్ర రుణం
రెండేళ్ల క్రితం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక
రుణంలో సంఘం వాటా రూ.42.86 లక్షలు
రైస్ మిల్లు నిర్మాణానికి చర్యలు
అధికారులే ప్రతిపాదనలు సిద్ధం చేశారు
తీవ్రంగా వ్యతిరేకించిన సొసైటీ సభ్యులు
కేంద్ర రుణం వద్దని మహాజన సభ తీర్మానం
కూటమి సర్కార్ నిలుపుదల చేస్తుందని ఆశ
గ్రామీణ బ్యాంక్‌గా సహకార రంగంలో ఒక వెలుగు వెలిగిన ఆచంట మృత్యుంజయ విశాల పరపతి సంఘంపై పైలట్ ప్రాజెక్ట్ పేరుతో అప్పుల భారం మోపవద్దని సభ్యులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత స్థలం, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సొసైటీని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి రైస్‌మిల్లు నిర్మాణానికి అధికారులే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే సొసైటీకి సొంత రైస్ మిల్ ఉన్నా అప్పు ఇచ్చి మరీ మళ్లీ నిర్మించడం ఏమిటని సభ్యులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న రైస్ మిల్లు నిర్వహణకు చేయూతనిస్తే రైతులకు ప్రయోజనం అంటున్నారు.
ఆచంట, జూలై 4(ఆంధ్రజ్యోతి): రైతులకు విశేష సేవలందిస్తున్న మృత్యుంజయ సహకార సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్ట్‌తో అప్పుల భారం పడనుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 11 రాష్ట్రాల్లో 11 చోట్ల వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు చేపట్టింది.
రాష్ట్రంలో ఆచంట సొసైటీని ఎంపిక చేయడంతో రూ.2.14 కోట్లతో రైస్‌మిల్లు నిర్మాణానికి ప్రతిపాదిం చారు. కేంద్ర రుణంతో సొసైటీ వాటా రూ.42.86 లక్షలు చెల్లించాలి. 2023 ఏప్రిల్ మంజూరు కాగా ప్రత్యేకాధి కారుల పాలనలో సభ్యులకు సమచారం అందించారు. అనంతరం జరిగిన మహాజన సభలో సొసైటీ సభ్యులు రుణ భారంపై తీవ్ర వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న మిల్లు నిర్వహణ భారంతో లీజుకు ఇచ్చారని, ఇప్పుడు అప్పు తీసుకుని మరో మిల్లు నిర్మాణం ఎందుకని సభ్యులు, రైతులు అభ్యంతరం తెలిపారు. మహాసభ తీర్మానం చేసినా అధికారులు ఖాతరు చేయకుండా రైస్ మిల్లు నిర్మాణం చేపట్టారు. దీనితో పలువురు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ అధికారులు కూడా కోర్టును ఆశ్రయించడంతో వేలాది రూపాయల భారం పడిందని రైతులు చెబుతున్నారు. రైస్‌మిల్లు నిర్మాణం కోర్టు స్టే కారణంగా నిలిచిపోయింది. సొసైటీ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరించ డంతో గ్రామస్థులు, రైతులు, అఖిలపక్ష నాయకులు కూడా అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. ఒక సమయంలో సొసైటీలో డిపాజిట్‌లు కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అధికారులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో సొసైటీ దివాలా తీస్తుందని ఖాతాదారులు, రైతులు పలుసార్లు సొసైటీ వద్ద సమావేశాలు ఏర్పాటుచేసి తీర్మానాలు కూడా చేశారు. అప్పట్లో ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని సభ్యులు, రైతులు, అఖిల పక్ష నాయకులు కోరుతున్నారు.