ఒకేసారి 4 ఉద్యోగాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:50 AM
చదువున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఓ కల. ఇందుకోసం ప్రయత్నం చేస్తూనే వుంటారు. కాని, సుదీర్ఘమైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం. ఇవి ఉన్నవారే తమ లక్ష్యాన్ని సాధిస్తారు.
ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు.. ఎంత మేర దృష్టి పెట్టామన్నదే కీలకం..
ఏలూరు గ్రంథాలయమే నా కోచింగ్ సెంటర్.. సెల్‌ఫోన్‌కు దూరంగా.. ఏడేళ్లు
గ్రూప్ 2 పరీక్ష పేపరు చూడగానే జాబ్ గ్యారెంటీ అని తెలిసిపోయింది
ఆంధ్రజ్యోతితో తణుకు మునిసిపల్ కమిషనర్ రాజ్‌కుమార్ ముచ్చట్లు
చదువున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఓ కల. ఇందుకోసం ప్రయత్నం చేస్తూనే వుంటారు. కాని, సుదీర్ఘమైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం. ఇవి ఉన్నవారే తమ లక్ష్యాన్ని సాధిస్తారు. కొందరు ఏదైనా ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటారు. అందుకు ఎంతో కష్టపడతారు. కాని, ఒకే ఏడాది నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు.. తణుకు మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రాజ్‌కుమార్. ఇది ఎలా సాధ్య మైంది ? ఆయన విజయం సాధించేందుకు పడిన తపన, కృషి ఎలాంటివి ? మొదలైన అంశాలపై ఆంధ్రజ్యోతి సండే స్పెషల్.. ఆయన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం..
మాది ఏలూరు. అమ్మ సత్యవతి గృహిణి. నాన్న వెంకటరమణ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి 2009లో రిటైర్ అయ్యారు. మేం నలుగురు అన్నద మ్ములం. అందరిలోకి నేనే చిన్నవాడిని. అన్నయ్య లు రమేష్ కరోనా సమయంలో చనిపోయారు. రాజేష్, బుచ్చిబాబు ఏలూరులో వ్యాపారం చేస్తు న్నారు. ప్రాథమిక విద్య ఏలూరు ప్రభుత్వ పాఠ శాలలోనే జరిగింది. ఇంటర్ చైతన్యలో, బీటెక్ తణుకు ఏఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివా. భార్య సూర్యప్రశాంతి, కుమార్తె ఐసాని సత్య, కుమారుడు ఈసాన్ వెంకటకార్తికేయ.
పోటీ పరీక్షలకు ప్రిపరేషన్..
బీటెక్ తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెట్టా. హైదరాబాద్ ఆర్.సి.రెడ్డి అకాడమీలో 2010– 11ల్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. కాని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. తర్వాత ఇంటి వద్ద, లైబ్ర రీలో పుస్తకాలు చదువుతూ గ్రూపు–2 పరీక్షకు ప్రిపేర్ అయ్యా. నోటిఫికేషన్‌కే ఆరేళ్ల సమయం పట్టింది. అయినా పట్టువదలకుండా నిరంతరం సబ్జెక్టు, దీని రిలేటెడ్ పుస్తకాలు వెయ్యి వరకు చదివాను. ప్రతి పుస్తకంలో తెలుసుకున్న కొత్త విషయాలను నోట్స్ రాసుకుంటూ ఉండేవాడిని.
ఒకే ఏడాది నాలుగు ఉద్యోగాలు
ఈ క్రమంలో ఎన్నో ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాశా. చివరకు కల ఫలించింది. 2017–18లో ఒకే సారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వాటిలో రైల్వేస్టేషన్ మాస్టారు, ఎస్‌ఎస్‌సీ క్లర్క్, పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రూపు–2లో 11వ ర్యాంకు సాధించి, ఓపెన్ కేటగిరీలో మొదటి నలుగురిలో ఒకరిగా నిలిచా. నా ఆనందానికి హద్దుల్లేవు. అన్ని ఉద్యోగాలలో ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మునిసిపల్ కమిషనర్‌పైనే ఆసక్తి చూపించా. తొలి పోస్టింగ్ 2018లో కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టా. తర్వాత మండపేట, ప్రస్తుతం తణుకు మునిసిపల్ కమిషనర్‌గా కొనసాగుతున్నా.
ఎన్ని గంటలు చదివామన్నది కాదు..
నాతోపాటు రోజూ లైబ్రరీలో 150 మంది వరకు చదివేవారు. వాళ్లలో నాతోపాటు మరొకరు మాత్ర మే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పోటీ పరీక్షలు రాసే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు. చది వే సమయంలో ఏ మేర దృష్టి పెట్టామన్నదే కీల కం. చాలామంది గ్యాప్ లేకుండా గంటల తరబడి చదువుతారు. నేను రెండు గంటలు చదివి.. తర్వా త అరగంట, గంట గ్యాప్ ఇచ్చేవాడిని. ఇలా చదివినప్పుడు మెదడు రిలాక్స్ అవుతుంది. చదివిన విషయం గుర్తుంటుంది. కష్టపడి చదవడం కాదు.. ఇష్టపడి చదవాలి.
సెల్‌ఫోన్‌కు దూరంగా..
నేను కాలేజి చదివే సమయంలో ఓ రోజు మా ఫ్రెండ్ బైక్‌పై వెళుతున్నాడు. అతని పేరు మర్చి పోయి ఒరే.. ఒరే అని పిలిచినా పలకలేదు. పేరు మర్చిపోయాననే బాధతో సెల్‌ఫోన్‌తో ఎక్కువగా వాడడం వల్లేనని అర్థమైంది. అంతే ఏడేళ్లపాటు ఫోన్ దూరం పెట్టా.
ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. ఇందులో తెలివైన వారు, తెలివి లేని వారనేది ఉండదు. ప్రతి ఒక్కరు వారి లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి అంతే..!
అదీ నా కాన్ఫిడెంట్
పోటీ పరీక్షలు రాసే వారికి కాన్ఫిడెంట్‌ను బట్టి ఉద్యోగం వచ్చేస్తుందనే సంకేతాలు ముందే అందుతాయి. నా విషయంలోనూ ఇది జరిగింది. గ్రూపు–2 పరీక్ష పేపరు చూసినపుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అందరూ ఓఎంఆర్ షీట్‌లో బబుల్స్ పెడుతున్నారు. నేను ఖాళీగా కూర్చున్నా. చివరి అర గంటలో పెట్టవచ్చనే ధీమా. ఈలోగా పరీక్ష కేంద్రానికి వచ్చిన స్క్వాడ్ నా పేపరు చూసి ఏమీ రాయలేదని అదోలా చూశారు. కాని, చివరకు ఏడు లక్షల మంది రాసిన ఈ పరీక్షల్లో ఒపెన్ క్యాటగిరీలో ఎంపికైన మొదటి నలుగురు అభ్యర్థుల్లో నేను ఒకడిగా నిలిచా.
– తణుకు, ఆంధ్రజ్యోతి