ఉచిత విద్య..మిథ్య
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:45 AM
పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లోని పిల్లలకు అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలన్న నియమ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో 25శాతం సీట్లు.. ఉచిత అడ్మిషన్లకు అడ్డంకులెన్నో!
జిల్లాలో 360 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు.. 223 విద్యాసంస్థల్లోనే అరకొరగా అడ్మిషన్లు!
ఏలూరు అర్బన్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లోని పిల్లలకు అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలన్న నియమ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. ఉచిత అడ్మిషన్లకు పలు ప్రైవేటు విద్యాసంస్థలు నిరాకరిస్తుండగా, తమకు నచ్చిన ప్రైవేటు స్కూలును ఈ పథకంలో ఎంచుకునే అవకాశం లేక పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు విముఖత చూపిస్తుండడం, పలు ఇతర కారణాలు ఉచిత కార్పొరేట్ విద్యకు ఆటంకాలుగా ఉన్నాయి.విద్యా హక్కుచట్టం–2009 సెక్షన్ 12(1)సీ నిబంధనల మేరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతికి ప్రభు త్వం కేటాయించిన సీట్ల సంఖ్యలో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, అనాథలు, హెచ్‌ఐవీ ఎఫెక్టెడ్, దివ్యాంగులు, బీసీలు, మైనార్టీలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొం టున్న వెనుకబడినవర్గాలు, పరిమిత వార్షికా దాయం వున్న ఓసీలు, తదితర కుటుంబాల పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పించాలి. ఇలా ఒకటో తరగతిలో ఉచిత సీట్లకు అడ్మిషన్ పొం దిన బాలబాలికలు 8వ తరగతి పూర్తి చేసేవరకు అదే ప్రైవేటు విద్యా సంస్థలో కొనసాగ వచ్చు. ఒకవేళ తల్లిదండ్రులకు ఇష్టంలేకపోతే పిల్లల ను వేరే స్కూలుకు మార్చు కోవచ్చు. అయితే స్కూలు మారినా లేదా నేరుగా రెండో తరగతి, ఆపై తరగతు ల్లోకి 25 శాతం సీట్ల కు ఉచిత అడ్మిషన్ నిబంధన వర్తించదు. రాష్ట్రంలో మూడు విద్యాసంవత్సరాలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. జిల్లాలో గత విద్యాసంవత్సరం (2024–25)లో 194 ప్రైవే టు విద్యాసంస్థల్లో ఉచిత అడ్మిషన్ల నిమిత్తం రెండు విడతల లాటరీ విధానంలో 723 మంది పిల్లలను ఎంపిక చేయగా 526 మంది వారికి కేటాయించిన ప్రైవేటు పాఠశాలల్లో చేరగా, మరో 197 మంది వివిధ కారణాల వల్ల చేరలేదు. 2023–24లో 497మందికి సీట్లు కేటాయించగా 318 మంది చేరగా 2022–23 విద్యాసంవ త్సరంలో 83 మందికి ఉచిత సీట్లు కేటాయించగా 55 మంది మాత్రమే చేరారు. జిల్లాలో ఒకటో తరగతి నుంచి ప్రాథమిక తరగతులు నిర్వహి స్తున్న ప్రైవేటు పాఠశాలలు 360 ఉన్నట్లు జిల్లా విద్యా శాఖవర్గాలు వివరించాయి. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు చొప్పున ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కొన్ని పెద్ద స్కూళ్లలో రెండు, అంతకంటే ఎక్కువ సెక్షన్లు ఉంటాయి. ఆ దామాషా ప్రకారం 25 శాతం సీట్లకు ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇవ్వడానికి ప్రైవే టు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో సెక్షన్‌ను(10 సీట్లు) చొప్పున ప్రామాణికంగా తీసుకున్నా కనీసం 3,600 సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. కాగా ఈ ఉచిత అడ్మిషన్లపై జిల్లాకు సంబంధించి కేటాయించాల్సిన సీట్లు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల వివరాలపై అధికారిక స్పష్టత లేదు. జిల్లావిద్యాశాఖ వద్ద పూర్తి స్థాయిలో వివరాలు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు అంది న దరఖాస్తుల నుంచి రాష్ట్రస్థాయిలోనే సమగ్రశిక్ష ఉన్నతాధికారులు లాటరీ విధానంలో పిల్లలను ఎంపికచేస్తున్నారు.
ఇక ప్రస్తుత విద్యాసంవత్సరం (2025–26)లో ఇప్పటివరకు 154 ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత అడ్మిషన్ల కింద తొలివిడత లాటరీలో సీట్లు ఖరారైన 392 మంది పిల్లల్లో తుదిగడువు ముగిసేనాటికి 286 మంది వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. తాజాగా శుక్రవారం రాత్రి విడుదల చేసిన రెండోవిడత లాటరీ ప్రవేశాల్లో మరో 69 ప్రైవేటు స్కూళ్లను జోడించి 134 మంది పిల్లలకు ఉచిత అడ్మిషన్లు కల్పించగా, వీరంతా రాగల వారం రోజుల వ్యవధిలో ఆయా పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని గడువు విధించారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూడు కేటగిరీలుగా.. బడ్జెటరీ, ప్రైవేటు/కార్పొరేట్, ఒకే పేరుతో బహుళప్రాంతాల్లో నిర్వహించే బ్రాండెడ్ పాఠశాలలుగా వర్గీకరిస్తుండగా, వీటిలో ప్రైవేటు, బ్రాండెడ్ పాఠశాలలు 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు సమాచారం.
అడ్మిషన్లకు ఇరువైపులా అడ్డంకులివే...
క్షేత్రస్థాయి సమస్యలు నాలుగేళ్లుగా పరిష్కారం కావడం లేదు. ఉచిత అడ్మిషన్ల కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులకు బోధించినందుకు ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం గత మూడేళ్లలో ఇంతవరకు నయాపైసా రీయింబర్స్ చేయకపోవడంతో పలు ప్రైవేటు విద్యాసంస్థలు 25 శాతం ఉచిత అడ్మిషన్ల పట్ల నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. ఇలా జిల్లా విద్యాశాఖకు పిల్లల తల్లిదండ్రుల నుంచి అందుతున్న ఫిర్యాదులను సంబంధిత మండల ఎంఈవో, డీఈవోల ద్వారా ఫోన్లు చేయించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్టుగానే ప్రభుత్వం ప్రాథమిక తరగతుల్లో ఉచిత సీట్లకు అడ్మిషన్లు పొందిన పిల్లల ఫీజులను యాజమాన్యాలకు చెల్లించాలని కోరుతున్నాయి. అడ్మిషన్ల మార్గదర్శకాలప్రకారం ఒకటో తరగతిలోకి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ పెద్ద(తల్లిదండ్రులు) నివసించే సచివాలయానికి ట్యాగ్ అయిఉన్నందున, సచివాలయ పరిధిలో 1–3 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే ఐచ్ఛికాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుమించి దూరంలో తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచే ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో పిల్లలను చేర్చేందుకు ఆప్షన్ ఇవ్వడానికి సాంకేతికంగా అవకాశం లేదు. ఇక తల్లికి వందనం ఆర్థికసాయం రూపేణా ఈ ఏడాది కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా ప్రతీ ఒక్కరికీ రూ.13వేలు చొప్పున తల్లి బ్యాంకు ఖాతాకు నగదు జమ చేయడంతో, అవే డబ్బులకు తమకు అనుకూలమైన, అందుబాటులోవున్న ప్రైవేటు పాఠశాలలో చేర్పించడానికి పేరెంట్స్ మక్కువ చూపుతున్నారన్న వాదనా లేకపోలేదు. మరోవైపు ఉచిత అడ్మిషన్ అనేది కేవలం ఫీజు చెల్లింపు నుంచి ఊరట మినహా, మిగతా వస్తువులైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, టై, తదితర విద్యాసామగ్రినంతా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సిందేనన్న షరతులవల్ల ఉచిత అడ్మిషన్లకు తల్లిదండ్రులు అంతగా మొగ్గు చూపడంలేదు.