15 నుంచి వందే భారత్
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:48 PM
నరసాపురం– చెన్నై వందే భారత్ రైలు సర్వీసు ఈనెల 15 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలే కరుల సమావేశంలో మాట్లాడారు.
నరసాపురం – చెన్నై సర్వీసు ప్రారంభమవుతుంది
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం టౌన్, డిసెంబరు 6(ఆం ధ్రజ్యోతి) : నరసాపురం– చెన్నై వందే భారత్ రైలు సర్వీసు ఈనెల 15 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వేశాఖ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వల్ల జనవరి 12న ప్రారంభిస్తామని ప్రకటించినా ప్రజల విజ్ఞప్తి మేరకు పండగ కంటే ముందే రైలు సర్వీస్ ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు. సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ తాడేపల్లిగూడెంలో హాల్ట్‌కు కూడా అనుమతి రానుందని తెలిపారు.
రూ. 1400 కోట్లతో జల జీవన్ మిషన్
గ్రామీణ ప్రాంత గృహాలకు తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో రూ.1400 కోట్ల భారీ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. కొవ్వూరు మండలం బంగారమ్మపేటలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.54 ఎకరాల్లో నిర్మించే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో గోదావరి నీటిని శుద్ధిచేసి జిల్లాలో మారుమూల ప్రాంతానికి సైతం అందేవిధంగా 2663 కి.మీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 3,19,954 ఇళ్లకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేస్తామన్నారు.
త్వరలో ఎన్‌హెచ్–165కు టెండర్లు
ఆకివీడు– దిగమర్రు– భీమవరం బైపాస్‌తో కలిపి ఎన్‌హెచ్–165 నిర్మా ణానికి సర్వే, డీపీఆర్, టెక్నికల్ సమస్యలు పరిష్కారం, ఇతర అనుమతు లు సాధించామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ కమిటీ అనుమతి కోసం చివరి దశలో ఉందని, జనవరి నెలాఖరు నాటికి పనులు ప్రారం భానికి టెండర్ పిలుస్తామని ఆయన తెలిపారు.
రూ.10 కోట్లతో డయాలసిస్ సెంటర్లు
జిల్లాలో రూ.10 కోట్లతో డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వర్మ తెలిపారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సుమారు రూ.10 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలుత భీమ వరం ఏరియా హాస్పిటల్ వద్ద రూ.2 కోట్లతో 8 అత్యాధునిక డయాలసిస్ యంత్రాలు, 8 బెడ్లు, ఆచంట సీహెచ్‌సీలో రూ.కోటి వ్యయంతో 3 డయాల సిస్ యంత్రాలు, 3 బెడ్లతో సెంటర్ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ నిర్విస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా రూ.4 కోట్లతో అత్యాఽధునిక క్యాన్సర్ స్ర్కీనింగ్ మొబైల్ యూనిట్ వ్యాన్ జిల్లా వాసులకు అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి వర్మ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడిక్కడే మహిళలకు పరీక్షలు చేసి రిపోర్టులు అందిస్తారని తెలిపారు.