100 పడకల ఆస్పత్రి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:09 AM
పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభానికి సిద్ధం అవుతోంది.

ప్రారంభానికి సిద్ధం అవుతున్న భవనం
పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం
వారం వారం పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల
ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబుచే ప్రారంభించడానికి ఏర్పాట్లు
పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభానికి సిద్ధం అవుతోంది. భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదట 30 నుంచి 50 పడకల ఆసుపత్రిగా విస్తరించిన దీనిని 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ నిధులు మంజూరు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా భవన నిర్మాణం జరుగుతోంది.
పాలకొల్లు అర్బన్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ పనులు గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రారంభించగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. భవన నిర్మాణ పనులు అంతంతమాత్రంగా జరిగాయి. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు నిమ్మల రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నియమితులు కావడంతో ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రి గుమ్మం వద్దకే తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిని ఆగస్టులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
138 మంది సిబ్బంది
ప్రస్తుతం ఆసుపత్రిలో 138 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోతోపాటు ముగ్గురు గైనకాలజిస్టులు సహా 18 మంది వైద్యులు ఉన్నారు. 40 మంది నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్‌వోలు 15 మంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆరుగురు, ల్యాబ్ టెక్నిషియన్స్, బ్లడ్ టెస్టింగ్ తదితరులు మరో 12 మంది శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఐదుగురు, ఆఫీసు సిబ్బంది ఆరుగురు ఉన్నారు.
పాలకొల్లులో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమైతే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతోపాటు కోనసీమ జిల్లాలోని మరో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. పాలకొల్లు మీదుగా జాతీయ రహదారి వెళుతుండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం కూడా అందుబాటులోకి వస్తుంది.