Share News

ముంచిన మామిడి!

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:23 AM

నూజివీడు, చింతలపూడి, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలోని మామిడి రైతులు ఈ ఏడాది భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ ప్రాం తంలో మామిడి సీజన్‌ జూన్‌లోనే ముగుస్తుంది. చిత్తూరులో మామిడి పంట జూలై నెలాఖరు వరకు ఉంటుంది.

ముంచిన మామిడి!
ప్రైవేటు మార్కెట్లో విక్రయించేందుకు తెచ్చిన మామిడికాయలు

మామిడి రైతులకు నష్టాలు

అయిన కాడికి అమ్ముకున్నారు..

అమలుకు నోచుకోని మామిడిమార్కెట్‌ ఏర్పాటు హామీ

నూజివీడు, జూలై12(ఆంధ్రజ్యోతి): నూజివీడు, చింతలపూడి, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలోని మామిడి రైతులు ఈ ఏడాది భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ ప్రాం తంలో మామిడి సీజన్‌ జూన్‌లోనే ముగుస్తుంది. చిత్తూరులో మామిడి పంట జూలై నెలాఖరు వరకు ఉంటుంది. ప్రభుత్వం ఆ ప్రాంతంలోని తోతాపురి మామిడికి కేజీకి రూ.4 ప్రోత్సాహకం ఇవ్వడమే కాక కేంద్ర సాయం కోరింది. ఇక్కడ మామిడి రైతుల పరిస్థితిని పట్టించుకునే వారు లేరు. మామిడి రైతులు, వ్యాపారులు అయినకాడికి పంట అమ్ముకున్నారు.

మామిడి మార్కెట్‌.. అతీగతీ లేదు

గతేడాది జూన్‌ 4న మామిడి రైతుల సమావేశంలో 2025 మామిడి సీజన్‌కు నూజివీడు మార్కెట్‌ యార్డులో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి రైతులకు హామీ ఇచ్చారు. అనుమతుల కోసం ఆర్థికశాఖ వద్ద ఆఫైలు పెండింగ్‌లో ఉంది. ఏడాది గడిచి మామిడి సీజన్‌ ముగిసినా అతీ గతీ లేదు.

మూతపడిన గుజ్జు కర్మాగారాలు

నూజివీడు ప్రాంతంలో పదేళ్ల క్రితమే మామిడి గుజ్జు కర్మాగారాలు మూతపడ్డాయి. వాటిని తెరిపించి ఉంటే రైతులకు కొంతమేలు జరిగేది. మామిడి పరిశోధన కేంద్రం ఉన్నప్పటికీ రైతులకు సస్య రక్షణ, మామిడి ఎగుమతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేవారు లేదు. ఈప్రాంతంలో మామిడి ఉప ఉత్పత్తుల కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని పదేళ్ల నుంచి రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు.

రైతులకు మేలు జరగాలంటే..

ఈ ప్రాంత మామిడి రైతులకు మేలు జరగాలంటే మామిడి పరిశోధన కేంద్రం పూర్తిస్థాయిలో పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుజ్జు కర్మాగారాలు తెరిపించి స్థానికంగా మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి. మామిడి జ్యూస్‌, పౌడర్‌, మామిడి తాండ్ర వంటి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి. గత పదేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న మామిడి రైతులు తోటలను నరికివేసి ఆ చెట్లను కలపకు అమ్ముకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మరలచడానికి సిద్ధపడుతున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:23 AM