Share News

Weak Monsoon Winds: బలహీనంగా రుతుపవనాలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:43 AM

దక్షిణ భారతంలో కొద్దిరోజులుగా ఈశాన్య రుతుపవనాలు బలహీనపడ్డాయి. బంగాళాఖాతం మీదుగా రావల్సిన తూర్పుగాలులు నిలిచిపోయాయి...

Weak Monsoon Winds: బలహీనంగా రుతుపవనాలు

  • ఉత్తరాది గాలులతో రాష్ట్రంలో పెరిగిన చలి

  • సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతంలో కొద్దిరోజులుగా ఈశాన్య రుతుపవనాలు బలహీనపడ్డాయి. బంగాళాఖాతం మీదుగా రావల్సిన తూర్పుగాలులు నిలిచిపోయాయి. దీంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా, కేరళ, కర్ణాటకల్లో వర్షాల జాడ లేక నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పంటల సాగుకు అవరోధం ఏర్పడింది. రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడ తప్ప రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 16వ తేదీ తర్వాత శ్రీలంక సమీపాన అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసినా.. ఇంత వరకూ అధికారికంగా వెల్లడించలేదు. కాగా, హిందూ మహాసముద్రంలో ఈ నెల 19 తర్వాత మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున అండమాన్‌ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత బలపడి తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే పలు మోడళ్లు అంచనా వేశాయి. అప్పటివరకూ రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా మాత్రమే వర్షాలు పడతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఉత్తరాది గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో మంగళవారం 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శివారు ప్రాంతాలలో చలిగాలులు కొనసాగుతాయని పేర్కొంది.

Updated Date - Nov 12 , 2025 | 04:43 AM