Share News

Financial Department: ఇచ్చిన నిధులతో సర్దుకోండి

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:36 AM

ఆర్థిక శాఖ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన నిధుల కోసం రూ.344 కోట్ల అభ్యర్థనను నిరాకరించింది. రూ.200 కోట్లతో ప్రాజెక్టులను నిర్వహించడానికి సలహా ఇచ్చింది, మిగతా నిధుల కోసం వచ్చే ఏడాది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Financial Department: ఇచ్చిన నిధులతో సర్దుకోండి

  • నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ఆర్థిక శాఖ సలహా

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు తగిన నిధులిచ్చేందుకు ఆర్థిక శాఖ సమ్మతించడం లేదు. ఈ ఏడాది రూ.344 కోట్లు అడిగితే.. అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. రూ.200 కోట్లు ఇస్తామని.. వాటితోనే సర్దుకోవాలని.. మిగతా 144 కోట్లతో వచ్చే ఏడాది నిర్వహణ చేపట్టాలని జల వనరుల శాఖకు ఉచిత సలహా ఇచ్చింది. వేసవి సమయంలో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుందని జల వనరుల శాఖ తెలిపింది. జగన్‌ ఐదేళ్ల హయాంలో అలా చేపట్టకపోవడం వల్లే భారీ విధ్వంసం జరిగిందని గుర్తు చేసింది. అయినా ఆర్థిక శాఖ రూ.344 కోట్ల ఫైలును తిప్పిపంపింది. దీంతో ఈ అంశాన్ని జలవనరుల శాఖ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దాని వాదనతో ఆయన ఏకీభవించారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమయ్యే నిధుల కోసం ప్రతిపాదిత ఫైలును కేబినెట్‌కు పంపితే ఆమోదిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ ఫైలును కేబినెట్‌ సమావేశంలో పెట్టనున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 03:39 AM