Share News

CM Chandrababu: నియోజకవర్గానికో విజన్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:37 AM

స్వర్ణాంధ్ర విజన్‌-2047 పకడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.

CM Chandrababu: నియోజకవర్గానికో విజన్‌

  • స్వర్ణాంధ్ర విజన్‌-2047 అమలుకు 175 స్థానాల్లో కార్యాలయాల ఏర్పాటు

  • వర్చువల్‌గా ప్రారంభించిన చంద్రబాబు

  • ఒక్కో యూనిట్‌కు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన 9 మందితో టీమ్‌

  • అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయం: సీఎం

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్‌-2047 పకడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ యూనిట్లకు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఒక్కో యూనిట్‌కు 9 మందితో టీమ్‌ ఉంటుందని తెలిపారు. ఒక్కో కార్యాలయానికి నిర్వహణ కోసం రూ.10 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఈ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు కూడా తీరిందని చెప్పారు. ఇకపై విజన్‌ డాక్యుమెంట్‌ అమలును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులదేనని అన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో విజన్‌ డాక్యుమెంట్‌ అమలుపై చంద్రబాబు చర్చించారు. యూనిట్‌ కార్యాలయాల్లో ఉండే 9 మంది టీమ్‌లో అధ్యక్షుడిగా ఎమ్మెల్యే, ఉపాధ్యక్షుడిగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి, సభ్యులుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ/నగర పంచాయతీ చైర్మన్‌, ఆర్డీఓ/సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఉంటారన్నారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా ఉంటారని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌లో రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగాల కల్పన, పేదరికం లేని సమాజం, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్‌, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్‌ విభాగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ యూనిట్‌ కార్యాలయాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో వీటిని అమలు చేయాలని సీఎం ఆదేశించారు.


అన్ని జిల్లాల సమాన అభివృద్ధి

26 జిల్లాల్లో ఐదేళ్లలో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై రోడ్‌మ్యాప్‌ రూపొందించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 400కి పైగా ప్రభుత్వ సేవలందిస్తున్నామని, వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లోకి తెస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కువ మంది మార్గదర్శులను పరిచయం చేసిన అధికారులకు అవార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తాను 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా దత్తతకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

2027 నాటికి పోలవరం పూర్తి

గత ప్రభుత్వం డయాఫ్రమ్‌ వాల్‌ను కాపాడి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. అయినా 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, 2028 నాటికి అమరావతి నిర్మిస్తామని చెప్పారు. విశాఖను ముంబై స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విశాఖ-విజయవాడ మెట్రో రైళ్లు, విశాఖ రైల్వేజోన్‌, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌-2047 తీసుకొస్తే దానికి అనుబంధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్‌ రూపొందించుకున్నామని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ త్వరలో మూడోస్థానానికి చేరుతుందన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులు ఆర్జిస్తున్నారని, ఇందులో 30 శాతంపైన తెలుగువారు ఉండడం గర్వకారణమన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 03:38 AM