Waqf Land Lease Cancelled After Public Uproar: వక్ఫ్‌లో ఎట్టకేలకు దిద్దుబాటు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:56 AM
వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు లీజు నోటీసును రద్దు చేసింది. ప్రభుత్వం知らకుండా నిర్ణయం తీసుకున్న బోర్డు సీఈవోపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది

వక్ఫ్ భూముల లీజు నోటీసు రద్దు
సీఎం ఆదేశాలతో వక్ఫ్‌బోర్డు వెనక్కి
బోర్డు సీఈవోపై వేటు?
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): భూములను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వక్ఫ్‌బోర్డు వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల నేపఽథ్యంలో ఈనెల 3వ తేదీన ఇచ్చిన లీజుదారుల ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) నోటీసు రద్దయింది. ఈ మేరకు వక్ఫ్‌బోర్డు సీఈవో బుధవారమే ప్రత్యేకంగా నోటీసు జారీ చేశారు. వ క్ఫ్‌బోర్డుకు 90వేల ఎకరాలు ఉన్నాయి. అందులో 30వేల ఎకరాలపైనే భూమి అన్యాక్రాంతమైంది. మిగిలిన భూమిని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలని వక్ఫ్‌బోర్డు ఆలోచించింది. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటి? ఆ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోకుండానే వక్ఫ్‌బోర్డు సీఈవో నిర్ణయాలు తీసుకున్నారు. వక్ఫ్‌బోర్డులోని కొందరు పెద్దల సిఫారసుతో ఆ భూములను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇచ్చేందుకు గాను ఆసక్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటీసు జారీ చేశారు. కానీ, అంతకు నాలుగు నెలల ముందే, ఆ భూములను ఎలాంటి వాణిజ్య అవసరాలకూ వాడొద్దని, కేవలం ముస్లిం వర్గాల సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించారు. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే వక్ఫ్‌బోర్డు సీఈవో ఆ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుపై ముస్లిం వర్గాల నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ముస్లిం సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన భూములను వాణిజ్య అవసరాలకు ఎలా వాడతారంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన ‘వక్ఫ్‌భూములకు ఎసరు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాలను ప్రచురించింది.
ఆ వార్తలోని అంశాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆమోదం, అనుమతి లేకుండా ఆ నోటీసు ఎలా ఇచ్చారని అధికారులను మందలించారు. తక్షణమే నోటీసును రద్దుచేయాలని మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించారు. దీంతో నోటీసును వెనక్కి తీసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి చిత్తూరు శ్రీధర్ వక్ఫ్‌బోర్డుకు ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి నివేదిక కోరారని తెలిసింది. ప్రభుత్వానికి తెలియకుండా నోటీసు ఇప్పించడంలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరి ప్రోద్బలం దీనివెనుక ఉందనేది ఆ నివేదికలో తెలపాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే, ఈ పరిణామాల ప్రభావం వక్ఫ్‌బోర్డు సీఈవోపై పడనుంది. ఇప్పుడున్న అధికారి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి వక్ఫ్‌బోర్డుకు రెగ్యులర్ సీఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాయింట్ సెక్రటరీ కేడర్‌లో ఉన్న ఐఏఎస్ కోసం అన్వేషిస్తున్నారు.