Share News

స్కానింగ్‌ కోసం నిరీక్షణ

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:32 PM

కర్నూలు జీజీహెచ న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో వైద్య పరీక్షలు, స్కానింగ్‌ పరీక్షల కోసం రోగులు నిరీక్షిస్తున్నారు.

   స్కానింగ్‌ కోసం నిరీక్షణ
స్కానింగ్‌ కేంద్రం వద్ద రోగులు

గంటల తరబడి పడిగాపులు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జీజీహెచ న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో వైద్య పరీక్షలు, స్కానింగ్‌ పరీక్షల కోసం రోగులు నిరీక్షిస్తున్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన సుభద్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉదయం 9 గంటలకు గైనిక్‌ వార్డుకు వచ్చింది. వైద్యులు పరీక్షించి రక్త పరీక్షలు, అలా్ట్రసౌండ్‌ రాసిచ్చారు. ఉదయం 10 గంటలకు రక్తపరీక్షలు అయిపోవడంతో అల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ కోసం న్యూడయోగ్నస్టిక్‌ బ్లాకులోని అల్ర్టాసౌండు రూం 2, 3 దగ్గరకు వచ్చింది. సుభద్ర తన మూడేళ్ల కూతురిని తీసుకునివచ్చింది. గంటల తరబడి పడిగాపులు కాయలేక తన కూతురిని నేలపై పడుకోబెట్టింది. వైద్యులు మాత్రం సుభద్రను స్కానింగ్‌ పరీక్షలకు పిలువలేదు. ఉదయం 10 గంటల నుంచి వేచి చూస్తున్నానని, ఆడ బిడ్డను చూసుకునే వారు లేక ఇక్కడికి తెచ్చానని, ఇక్కడ గంటలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మధ్యాహ్నం 2.15 గంటలకు స్కానింగ్‌ పరీక్ష అయిపోవడంతో పడుకోబెట్టిన బిడ్డను ఎత్తుకొని వైద్యుల దగ్గరకు వెళ్లింది. ఇలా అలా్ట్రసౌండు పరీక్షల కోసం ఒక్క సుభద్ర మాత్రమే కాక రోగులందరూ ఇబ్బందులు పడుతున్నారు.

ఫ టోకెనలు ఇవ్వని సిబ్బంది:

అల్ర్టాసౌండు స్కానింగ్‌ పరీక్షలు కావాల్సిన ఓపీ రోగులకు న్యూడయోగ్నస్టిక్‌ బ్లాకులో అల్ర్టాసౌండు 2, 3 కేంద్రాల వద్ద టోకెన ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత టోకెనను కొద్ది రోజులుగా నిలిపివేశారు. వంద టోకెనలు మాత్రమే ఇస్తున్నారని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత టోకెనలు ఇవ్వకపోవడంతో తామంతా పడిగాపులు కాస్తున్నామని రోగులు మండిపడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి రేడియాలజీ వైద్యులు గానీ, ఆసుపత్రి అధికారులు గానీ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు టోకెనలు ఇచ్చి అల్ర్టాసౌండు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించాలని రోగులు కోరుతున్నారు.

ఎక్స్‌రే కోసం తిప్పలు

పని చేయని కంప్యూటర్‌ రేడియోగ్రఫీ రీడర్‌

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎక్స్‌రే పరీక్షల కోసం వచ్చే రోగులు తిప్పలు తప్పడం లేదు. శనివారం పాత రేడియాలజీ విభాగంలో కంప్యూటర్‌ రేడియోగ్రఫీ రూంలోని క్యాసెట్‌ రీడర్‌ కాలిపోవడంతో అక్కడ ఎక్స్‌రే పరీక్షలు నిలిచిపోయాయి. పాత రేడియాలజి విభాగంలో ఎంఎల్‌సీ, క్యాజువాల్టీ, 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతిరోజూ 200 నుంచి 250 ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తారు. కానీ క్యాసెట్‌ రీడర్‌ కాలిపోవడం, ప్రింటర్‌ తరచుగా పని చేయకపోవడంతో పాత రేడియాలజీకి ఎక్స్‌రే పరీక్షల కోసం వచ్చిన రోగులను న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌కు పంపడం, అక్కడ నుంచి మళ్లీ ఇక్కడకి పంపడంతో రోగులు తిరగలేక నీరసించిపోయారు. ముఖ్యంగా ఎంఎల్‌సీ, క్యాజువాల్టీ చిన్నారులు న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌, పాత రేడియాలజీ విభాగానికి తిరగలేక అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో పరికరాల మరమ్మతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాల మరమ్మతుల పేరిట ప్రతి నెలా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నా ఆసుపత్రిలో పరికరాలు సక్రమంగా పని చేయడం లేదు. పాత రేడియాలజీ విభాగంలో సీఆర్‌ క్యాసెట్‌ రీడర్స్‌, ఫిల్మ్‌ ప్రింటర్లు తరచూ మరమ్మతులకు గురి కావడంతో ఇటీవల కాలంలో ఎక్స్‌రే సేవలకు అంతరాయం కలుగుతోంది. పాత రేడియాలజి విభాగంలో ఎక్స్‌రే పరీక్షలు నిలిచిపోయినా వాటిని మరమ్మతులు చేయాల్సిన సైరెక్స్‌ సంస్థ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:32 PM