వేతన వ్యథలు..!
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:55 PM
వ్యవసాయ సీజన ముగిసింది. సొంతూళ్లలో పనులు లేవు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టినా రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే రూ.250-300లకు మించి కూలీ గిట్టుబాటు కావడం లేదు.

ఉపాధి కూలీలకు ఆరు వారాలుగా అందని కూలి
జిల్లాలో రూ.22 కోట్లు బకాయి
మెటీరియల్ కాంపోనెట్ బకాయి రూ.40 కోట్ల పైమాటే
బతుకు పోరులో వలసబాటన కూలీలు
కర్నూలు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సీజన ముగిసింది. సొంతూళ్లలో పనులు లేవు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టినా రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే రూ.250-300లకు మించి కూలీ గిట్టుబాటు కావడం లేదు. ఆ డబ్బయినా ప్రతీవారం ఇస్తున్నారా..? అంటే అదీలేదు. ఐదారు వారాలుగా బకాయి ఉంటోంది. ఎన్నాళ్లు పస్తులతో పనులు చేసేది..? అంగడికి వెళితే అరువు పుట్టదు.. ఉపాధి పనులకెళ్తే వేతనాలు వెంటనే అందని పరిస్థితి. ఇక చేసేదేమీ లేక వలస శర్యణం..! అంటూ వలస బండెక్కి పోలోమని సాగిపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఉపాధి వేతనాలు రూ.22 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులు ఎప్పుడిస్తారో..? చెప్పలేని స్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. మెటీరియల్ కాంపోనెట్ బకాయిలు సైతం రూ.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి కూలీల ఆకలి తీర్చాలని పలువురు కోరుతున్నారు.
కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో 25 మండలాలు, 484 గ్రామ పంచాయతీలు, 237 మజారా గ్రామాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎనఆర్‌జీఎస్) అమలులో భాగంగా 3.32 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో పనులకు హాజరయ్యే యాక్టీవ్ జాబ్ కార్డులు 2.63 లక్షలు వరకు ఉన్నాయని డ్వామా రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం. కొత్త, పాత కలిపి 54 వేల పనులు గుర్తించారు. 10,305 పనులు పూర్తి చేయగా.. 44 వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు రూ.303.44 కోట్లు ఖర్చు చేశారు. అందులో కూలీల వేతనాలు (లేబర్ బడ్జెట్) రూ.213.55 కోట్లు కాగా.. మెటీరియల్ కాంపోనెంట్ రూ.73.04 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. మరో నెలన్నరలో ఈ ఆర్థిక సంవ్సరం ముగుస్తుంది. అయినా ఆరు వారాలుగా ఉపాధి కూలి డబ్బులు అందడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ రూ.22 కోట్లు బకాయి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం డ్వామా అధికారులు జిల్లాను ఆదోని, ఆలూరు, కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ కింద ఐదు మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కనిష్ఠంగా 2,500 మందికి, గరిష్ఠంగా 7,800 మంది చొప్పున ప్రతి రోజు జిల్లాలో లక్ష మందికి ఉపాధి పని కల్పించాలని లక్ష్యం. అయితే ప్రస్తుతం 55-60 వేల మందికి మించి ఉపాధి పనులకు రావడం లేదని తెలుస్తోంది. ప్రధాన కారణం రోజంతా కష్టపడితే సగటున రూ.250-288లకు మించి కూలిడబ్బు పడడం లేదు. ఆ డబ్బు కూడా ఆరు వారాలుగా బకాయి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.8,500 నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉందని సమాచారం. జిల్లాలో రూ.22 కోట్లకు పైగా బకాయి ఉంది. జనవరి 5వ తేది వరకు ఆనలైనలో అప్‌లోడ్ చేసిన కూలీలకు కూలి సొమ్ము వచ్చిందని అంటున్నారు. అంటే డిసెంబరు ఆఖరి వారం వరకు డబ్బులు వచ్చింది. జనవరి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంటే ఆరు వారాలుగా ఉపాధి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు.
ఫ సీసీ రోడ్లకు బిల్లులు రూ.40 కోట్లు
మెటీరియల్ కాంపోనెంట్ అమౌంట్ రూ.40 కోట్ల బకాయి ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో సర్పంచులు, టీడీపీ కూటమి, గ్రామీణ నాయకులు అప్పులు చేసి పనులు చేస్తే.. సకాలంలో బిల్లులు రాక అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ మూడు వారాలు కూలి డబ్బు రావాలి
- బోయ వెంకటేశ, కోగిలితోట గ్రామం, హోళగుంద మండలం
మా ఊళ్లోనే నేను, నా భార్య, ముగ్గురు కొడుకులు, కోడళ్లు.. మొత్తం ఎనిమిది మంది ఉపాధి పనులకు వెళ్తున్నాం. రోజంతా కష్టపడితే రూ.250 కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా ఊళ్లోనే కాదా అని మట్టి పనులకు వెళ్తున్నాం. మూడు వారాలుగా ఉపాధి కూలి డబ్బు రూ.41 వేలు రావాల్సి ఉంది. అధికారులను అడిగితే అప్‌లోడ్ చేశాం.. ఏదో ఒకరోజు మీ అకౌంట్లో పడుతాయని అంటున్నారు. తిండిగింజలకు అప్పు పుట్టడం లేదు. అంగడికి వెళితే ఉద్దర ఇవ్వమంటున్నారు. చేసేది లేక ఉపాధి పనులు ఆపేసి రోజు కూలి వచ్చే పనులు వెతుక్కుంటున్నాం. రేపోమాపో వలస వెళ్లక తప్పని పరిస్థితి.
ఫ ఆరు వారాలు నుంచి డబ్బు ఇవ్వలేదు
- అయ్యమ్మ, ఎర్రదొడ్డి గ్రామం, కోడుమూరు మండలం
నేను ఒంటిరి మహిళను. కూలీనాలి చేసుకొని జీవనం సాగిస్తున్నాను. ఊళ్లోనే ఉపాధి పనులకు వెళ్తున్నాను. ఆరు వారాల నుంచి కూలి డబ్బులు ఇవ్వలేదు. ఇతర పనులకు వెళ్దామంటే వ్యవసాయ పనులు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. బతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మా గోడు పట్టించుకొని వెంటనే ఉపాధి వేతనాలు చెల్లించాలి.
ఫ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవాలంటున్నారు
- శివయ్య, వర్కూరు గ్రామం, కోడుమూరు మండలం
నా భార్య గోవిందమ్మ, నేను ఇద్దరం ఉపాఽధి పనులకు వెళ్తున్నాం. నాలుగు వారాలుగా మాకు కూలి డబ్బు ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఎదో ఒకరోజు డబ్బు వస్తుంది.. బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాలని అంటున్నారు. నిత్యం బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటున్నాం. కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, రోజువారి ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నాం. ఎలా నెట్టుకురావాలో అర్థం కావడం లేదు.
ఫ రూ.22 కోట్లు బకాయి ఉంది
- వెంకట రమణయ్య, డ్వామా పీడీ, కర్నూలు
జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రూ.22 కోట్లు వేతన బకాయి ఉన్నమాట నిజమే. జనవరి 5వ తేది వరకు ఆనలైనలో అప్‌లోడ్ చేసిన వారందరికి ఖాతాలో డబ్బు పడింది. ఆ తరువాత వేతనాలు రావాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఆనలైనలో అప్‌లోడ్ చేస్తున్నాం. మెటీరియల్ కాంపోనెంట్ అమౌంట్ రూ.40 కోట్లు బకాయి ఉంది.