యువత సన్మార్గంలో నడవాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:31 PM
గిరిజన యువత సన్మార్గంలో నడవాలని ఎస్పీ ఎస్‌వీ మాదవరెడ్డి అన్నారు.
- ఎస్పీ మాధవరెడ్డి
సీతంపేట రూరల్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి):గిరిజన యువత సన్మార్గంలో నడవాలని ఎస్పీ ఎస్‌వీ మాదవరెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దోనుబాయి పోలీసుల ఆధ్వర్యంలో దోనుబాయి గ్రామంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మెగా వాలీబాల్ టోర్నీ ఫైనల్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. ‘గిరిజన ప్రజలు, యువత, విద్యార్థులతో మమేకమవ్వడమే కమ్యూనిటీ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే దోనుబాయిలో ఇటీవల వైద్య శిబిరం, ఇప్పుడు మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించాం. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలి. వీటితో యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. గంజాయి అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వీటి సమాచారం కోసం క్యూర్ కోడ్‌ను అందుబాటులో ఉంచాం. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం. సైబర్ నేరగాళ్లపై అందరూ అప్రమత్తంగా ఉండాలి.’ అని అన్నారు. అనంతరం మెగా వాలీబాల్ ఫైనల్‌లో తలపడిన పొల్ల కాలనీ, దుగ్గి టీం సభ్యులను ఎస్పీ పరిచయం చేసుకున్నారు. వాలీబాల్ సర్వీస్ చేసి పోటీని ప్రారంభించారు. ఈ టోర్నీలో మొత్తం 44 టీంలు పాల్గొనగా వీటిలో దుగ్గి జట్టు విజేతగా నిలిచింది. పొల్ల కాలనీ ద్వితీయ, పెద్ద పల్లంకి తృతీయ స్థానంలో నిలిచాయి. వీరికి నగదు బహుమతితో పాటు మెమోంటోలను ఎస్పీ అందజేశారు. క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు, స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలకొండ సీఐ ఎం.చంద్రమౌళి, దోనుబాయి, వీరఘట్టం, బత్తిలి, సీతంపేట ఎస్‌ఐలు మస్తాన్, అమ్మనరావు, అనిల్, కళాధర్, ఏఎస్‌ఐ త్రినాథరావు, ట్రైనీ ఎస్‌ఐలతో పాటు ఎంపీపీ ఆదినారాయణ, దోనుబాయి పీహెచ్‌సీ వైద్యాధికారి భానుప్రతాప్, పీడీ ఆర్‌సీ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.