వేగావతి నదిలో యువకుడి గల్లంతు
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:27 AM
జె.రంగరాయపురం సమీపంలో బుధవారం వేగావతి నదిలో స్నానానికి దిగిన పాటోజు యోగీశ్వరరావు(22) అనే యువకుడు గల్లంతయ్యాడు.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జె.రంగరాయపురం సమీపంలో బుధవారం వేగావతి నదిలో స్నానానికి దిగిన పాటోజు యోగీశ్వరరావు(22) అనే యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఆ యవకుడు మాల ధారణలో ఉన్నాడు. పట్టణంలోని కంచరవీఽధికి చెందిన యోగీశ్వరరావు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మరో ఐదుగురు భవానీ భక్తులతో కలిసి వేగావతిలో స్నానం చేసేందుకు దిగాడు. నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో యోగీశ్వరరావుతో పాటు వినయ్, చరణ్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వినయ్, చరణ్‌లు చెట్లపొదలకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు. యోగీశ్వరరావు నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ కొండలరావు, ఫైర్ స్టేషన్ హెచ్‌సీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నలుగురు సిబ్బంది నదిలో సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేదు. యోగీశ్వరరావు పట్టణంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు నదిలో గల్లంతవ్వడంతో తల్లిదండ్రులు వీరాచారి, సుజాత, తమ్ముడు శ్యామ్ కన్నీరుమున్నీరయ్యారు.