ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:05 AM
ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాయవలస పంచాయతీ నారుపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
భోగాపురం, జూలై11 (ఆంధ్రజ్యోతి): ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాయవలస పంచాయతీ నారుపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.సూర్యకుమారి, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నారుపేటకు చెందిన అట్టాడ కనకరాజు, సరస్వతి దంపతులకు కుమార్తె పుష్ప(22), కుమారుడు ఆదినారాయణ ఉన్నారు. పుష్ప శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని ఓ పరిశ్రమలో ఫిల్లింగ్ ఆపరేటర్‌గా రెండేళ్లుగా పని చేస్తుంది. పుష్ప, విశాఖ జిల్లా మాడుగులకు చెందిన సాయి అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. తన స్నేహితురాలి వివాహం ఉందని చెప్పి పుష్ప, మరో స్నేహితురాలైన భోగాపురం గ్రామానికి చెందిన ఆళ్ల ఝాన్సీ కలిసి ఈనెల 6న పెందూర్తి వెళ్లారు. తిరిగి ఈనెల 10న ఉదయం పుష్ప ఇంటికి వచ్చింది. ప్రేమ విషయంలో సాయితో గొడవపడడంతో ఆమె ముభావంగా ఉండేది. అదే రోజు రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు పుష్పను కిందకు దించి తగరపువలసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పుష్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రేమ విఫలమైనందునే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని తండ్రి కనకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు. ఇంటికి ఆదాయం తెచ్చి, పెద్దదిక్కుగా ఉన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పుష్ప మృతితో నారుపేటలో విషాదచాయలు అలముకున్నాయి.