Share News

5,775 కేంద్రాల్లో యోగా

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:54 PM

జిల్లాలోని 5,775 కేంద్రాల్లో శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరగనుందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు.

  5,775 కేంద్రాల్లో యోగా
మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

- రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో 5వేల మందితో సాధన

- కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 5,775 కేంద్రాల్లో శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరగనుందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది పాల్గొనున్నారని తెలిపారు. కలెక్టరేట్‌లో మండల అధికారులతో ఆయన శుక్రవారం సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సచివాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థల వద్ద యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ క్రీడామైదానంలో 5వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లా అధికారులు, ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

యోగాంధ్ర కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో శుక్రవారం కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ అంబేడ్కర్‌ ప్రారంభించారు. ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున అధికారులును నియమించారు. బస్సులన్నీ మండలాలకు చేరింది.. లేనిది తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి బస్సులో ఒక వైద్య సిబ్బందిని నియమించి, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, సీపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

రెవెన్యూ అధికారులు చట్టాలపై అవగాహన పొంది, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పని చేస్తే ఉన్నతాధికారులతో పాటు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటారని తెలిపారు. అలాగే వృత్తి పరమైన సంతృప్తి లభిస్తుందన్నారు. ప్రధానంగా యువ ఉద్యోగులు పలు అంశాలపై అవగాహన పెంచుకుని, వారి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అటెండర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకూ రిటైర్డ్‌ అయిన ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవోలు ఆశయ్య, రామ్మోహన్‌రావు, రిటైర్డ్‌ డీఆర్వో గణపతిరావు, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:54 PM