YCP’s Negligence.. వైసీపీ నిర్లక్ష్యం.. ఆ బడులకు శాపం!
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:19 PM
YCP’s Negligence.. A Curse for Those Schools! నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చా మని గత వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏ మాత్రం పట్టించు కోలేదు. పనుల పూర్తికి నిధులు మంజూరు చేయలేదు.
బొడ్డగూడలో కమ్యూనిటీ హాలులోనే ఓ వైపు బడి.. మరోవైపు సచివాలయం
బురుజోలలో రేకుల షెడ్‌లోనే బోధన
విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు
భామిని,సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చా మని గత వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏ మాత్రం పట్టించు కోలేదు. పనుల పూర్తికి నిధులు మంజూరు చేయలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైంది. గతంలో నాడు-నేడు కింద భామిని మండలంలో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు అర్ధాం తరంగా నిలిచిపోయాయి. దీంతో నేటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
ఇదీ పరిస్థితి..
భామిని మండలంలో నాడు-నేడు కింద రెండు విడతల్లో 32 పనులతో పాటు 12 అదనపు భవనాలు మంజూరు చేశారు. అయితే బొడ్డగూడ, భామినిలో కేజీబీవీ లివిరి, దిమ్మిడిజోల తదితర గ్రామాల్లో భవనాలన్నీ అర్ధాంతరంగా నిలిచిచాయి. బొడ్డగూడ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 70 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ గతంలో ఐటీడీఏ నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరడంతో దానిని తొలగించారు. దాని స్థానంలో నూతనంగా పాఠశాల నిర్మించలేదు. దీంతో అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్‌లోనే 2014 నుంచి ప్రాథమిక పాఠశాల కొనసాగింది. 2019లో ఇదే భవనంలో సచివాలయం మంజూరైంది. దీంతో ఒకవైపు పాఠశాల, మరో వైపు సచివాలయం కొనసాగిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాడు- నేడు రెండో విడతలో పాఠశాలకు, సచివాలయానికి భవనాలు మంజూరయ్యాయి. అయితే అరకొర నిధులు, అధికారుల నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా ఈ రెండు భవనాల పనులు నిలిచిపోయాయి. బురుజోలలో పాఠశాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న రేకులషెడ్‌లోనే ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభించారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే తరగతులు కొనసాగిస్తున్నారు. అయితే ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చిన్నారుల తల్లిండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. నాడు- నేడు రెండో విడతలతో పాఠశాలకు భవనం మంజూరైనా నిధులు కేటాయించలేదు. దీంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి సారించి తగు చర్యలు తీసు కోవాలని మండల వాసులు కోరుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా... ‘అర్ధాంతరంగా నిలిచిపోయిన పాఠశాల భవనాల పరిస్థితిని అధికారులకు తెలియజేశాం. నిధులు మంజూరైన వెంటనే పనులు పునఃప్రారంభమవుతాయి.’ అని తెలిపారు.