YCP leader robbed వైసీపీ నేతకు దోచిపెట్టారు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:41 PM
YCP leader robbed బొబ్బిలి పట్టణంలోని ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో నెలకొన్న లోటుపాట్లను బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) గురువారం అసెంబ్లీ సమావేశంలో ఎండగట్టారు. ఎన్నాళ్లయినా అభివృద్ధి లేకపోవడం.. స్థానికులకు ఉపాధి చూపకపోవడం.. వైసీపీ నేతకు భూమిని అడ్డుగోలుగా అప్పగించడం తదితర పరిణామాలను ప్రస్తావించారు. ఆయన లేవనెత్తిన అంశాలకు మంత్రి టీజీ భరత్ వివరణ ఇచ్చారు.
వైసీపీ నేతకు దోచిపెట్టారు
గ్రోత్ సెంటర్ సమస్యలపై అసెంబ్లీలో ఎండగట్టిన ఎమ్మెల్యే
భూమిని అడ్డుగోలుగా అప్పగించారని బేబినాయన ఆవేదన
స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవని వివరణ
సమీక్ష జరుపుతామని మంత్రి టీజీ భరత్ సమాధానం
బొబ్బిలి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణంలోని ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో నెలకొన్న లోటుపాట్లను బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) గురువారం అసెంబ్లీ సమావేశంలో ఎండగట్టారు. ఎన్నాళ్లయినా అభివృద్ధి లేకపోవడం.. స్థానికులకు ఉపాధి చూపకపోవడం.. వైసీపీ నేతకు భూమిని అడ్డుగోలుగా అప్పగించడం తదితర పరిణామాలను ప్రస్తావించారు. ఆయన లేవనెత్తిన అంశాలకు మంత్రి టీజీ భరత్ వివరణ ఇచ్చారు. బేబీనాయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘తెలుగువారి అభిమాన నాయకుడు నందమూరి తారకరామారావు చెప్పడంతో 1995లో గ్రోత్‌సెంటరు ఏర్పాటు కోసం మెట్టవలస, ఎం.బూర్జివలస, ఎం.పణుకువలస, గొర్లె సీతారాంపురం, నారాయణప్పవలస, కాశిందొరవలస గ్రామాలకు చెందిన రైతులు కారుచౌకగా భూములిచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న సంకల్పంతో వందలాదిమంది రైతులు 1104 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే పరిశ్రమలన్నీ ఎకరా, రెండెకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి, ఆశయానికి భిన్నంగా కొంతమంది దురుద్దేశపూర్వకంగా అక్కడ స్థలాలను పొందారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి స్థలాలు దక్కించుకున్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం అప్పటి అధికార పార్టీ నేతకు 30 ఎకరాలను చౌకగా కేటాయించింది. ప్రత్యేకంగా ఓ జీఓను విడుదల చేసి మరీ ఆయనకు కట్టబెట్టారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత బంధువు ఒకరు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారిగా ఉండడంతో వైసీపీ నేత పెట్టబోయే పరిశ్రమకు వేగావతి నదీజలాలు వాడుకునే వెసులుబాటు కల్పించారు. వేగావతి నది ఇప్పటికే సాగు, తాగునీటి అవసరాలను తీర్చలేకపోతోంది. గ్రోత్‌సెంటరులో పరిశ్రమలకు అవసరమైన నీటిని తోటపల్లి లేదా ఇతరత్రా ప్రాజెక్టుల నుంచి అందివ్వాలి. పవర్ సబ్సిడీని గతంలో మాదిరిగా ఇవ్వాలి.
- గ్రోత్‌సెంటరులో పరిశ్రమల నిర్వాహకులకు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు పరుగులు తీయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొంది. యుద్ధప్రాతిపదికన ఇక్కడ పర్మినెంట్ అధికారులను, సిబ్బందిని నియమించకపోతే ఉన్నకొద్దిపాటి పరిశ్రమలు సైతం తరలిపోయే ప్రమాదం ఉంది.
- భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు అవసరమైన అర్హత కలిగి ఉన్నప్పటికీ పరిశ్రమల యజమానులు చత్తీస్‌గడ్, ఒడిశా, బీహార్ తదితర ప్రాంతాల నుంచి కార్మికులను పనిలోకి తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. నైపుణ్య శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని’ ప్రభుత్వాన్ని బేబీనాయన కోరారు.
- ఎమ్మెల్యే ప్రసంగానికి స్పందించిన స్పీకరు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ బొబ్బిలిలో ఓ మంచి కార్యక్రమం పెట్టి పరిశ్రమల మంత్రిని ఓసారి బొబ్బిలికి ఆహ్వానించి సమీక్ష జరిపించాలని సూచించారు.
- ఎమ్మెల్యే బేబీనాయన గ్రోత్‌సెంటరు సమస్యలపై లేవనెత్తిన అంశాలకు పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. గ్రోత్‌సెంటర్‌ను విజిట్ చేసి సమీక్ష జరుపుతామన్నారు. నీటి సమస్య కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ హయాంలో అక్రమంగా ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేశామని, దీనిపై మరోసారి పరిశీలిస్తామన్నారు.