Share News

worry in weaver మగ్గం ఆడక.. దిక్కు తోచక

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:09 AM

worry in weaver మగ్గం నేస్తూ కొందరు.. నూలు వడుకుతూ మరికొందరు.. చరకా యంత్రం తిప్పుతూ ఇంకొందరు.. వారికి సహకరించే మరింత మంది కార్మికులతో కళగా ఉండే ఆ భవనం నేడు వెలవెలబోతోంది. కార్మికులు చెమటోడ్చి తయారు చేసిన చేనేత వస్త్రాలు ఓ చోట పేరుకుపోయాయి.

worry in weaver మగ్గం ఆడక.. దిక్కు తోచక
చేనేత సహకార భవనం

మగ్గం ఆడక.. దిక్కు తోచక

డోలాయమానంలో చేనేత కార్మికులు

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు

సహకార భవనంలో పేరుకుపోయిన చేనేత వస్ర్తాలు

కొనుగోలు చేయని ఆప్కో

బకాయిలూ చెల్లించని వైనం

జిల్లాలో నిలిచిపోయిన కోట్ల రూపాయల చెల్లింపులు

మగ్గం నేస్తూ కొందరు.. నూలు వడుకుతూ మరికొందరు.. చరకా యంత్రం తిప్పుతూ ఇంకొందరు.. వారికి సహకరించే మరింత మంది కార్మికులతో కళగా ఉండే ఆ భవనం నేడు వెలవెలబోతోంది. కార్మికులు చెమటోడ్చి తయారు చేసిన చేనేత వస్త్రాలు ఓ చోట పేరుకుపోయాయి. సరుకు అమ్ముడుపోక.. ఉపాధి లేక వారంతా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజాం మండలం పెనుబాక చేనేత భవనంలో పనిచేసిన కార్మికుల పరిస్థితి ఇది. ఇటు జిల్లాలోనే బాగా నడిచిన సహకార సంఘంగా పేరొందిన పెనుబాక సొసైటీ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆప్కో నుంచి దాదాపు రూ.50 లక్షల బకాయి పెండింగ్‌లో ఉండడంతో నడవలేని స్థితికి చేరుకుంది.

రాజాం/ రూరల్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి):

ఒక్క పెనుబాకలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సొసైటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొట్టక్కి, కోటగండ్రేడు, బొద్దాం, పెనుబాక, రాజాం సహకార సంఘాల్లో మాత్రమే కార్మికులు చేనేత వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆప్కో నుంచి కోట్లాది రూపాయలు చెల్లింపులు నిలిచిపోగా.. ఉత్పత్తులు ఎక్కడికక్కడే సొసైటీల్లో ఉండిపోయాయి. అదే సమయంలో నూలు సరఫరా సైతం నిలిచిపోవడంతో చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూటమి వచ్చిన తరువాత చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ వంటివి అమలు చేసింది కానీ నిబంధనల పుణ్యమా అని సాంత్వన చేకూర్చడం లేదు. లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో చేనేత శాల మాదిరిగా పెనుబాకలోనూ చేనేత శాల ఏర్పాటు చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ చేనేత శాల ఏర్పాటుచేస్తే ఎంపీ ల్యాడ్‌ నిధుల నుంచి కోటి రూపాయలు ఇచ్చేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఎందుకో ఒక అడుగూ ముందుకు పడలేదు.

ఉమ్మడి జిల్లాలో 25 సహకార సంఘాల పరిధిలో 4 వేల మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 13 సంఘాలే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 2500 చేనేత కుటుంబాల్లో కేవలం 1500 మంది మాత్రమే మగ్గాలపై పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలు కూడా చేనేత వృత్తి తగ్గుముఖం పట్టడానికి మరో కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా పట్టు, నూలు వంటి మూడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తేసింది. నూలు, రంగులు, రసాయనాలపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీని విధించింది. వైసీపీ హయాంలో నేతన్న నేస్తం పథకం తప్పించి చేనేత సంఘాలకు ఎటువంటి సహకారం అందలేదు. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పొరేషన్‌ ద్వారా విరివిగా రుణాలు కూడా అందేవి.

మగ్గుతున్న వస్త్రాలు..

గతంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫారం ఆప్కో ద్వారా కుట్టించేవారు. ఆ పనిని రాజాం, కోటగండ్రేడు, పెనుబాక, కొట్టక్కి చేనేత సహకార సొసైటీలకు అప్పగించారు. అయితే రూ.33 లక్షల విలువైన వస్త్రం కొనుగోలు చేయక నేటికీ అలాగే ఉండిపోయింది. వైసీపీ సర్కారు హయాంలో 60 వేల టన్నుల సరుకు నిల్వ ఉండిపోయింది. అవన్నీ సొసైటీ గోదాముల్లో మగ్గుతున్నాయి. అప్పటి నష్టం ఇప్పటికీ భర్తీ కాలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తవ్వాళ్లు, పంచెలకు ఆర్డర్లు వచ్చేవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి కూడా నిలిచిపోయాయి. ఒక్క పెనుబాక సొసైటీకే రూ.1.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నిలిచిన నూలు సరఫరా..

చేనేత సహకార సంఘాలకు నూలు సరఫరా నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. అధిక ధరకు బయట మార్కెట్లో కొనుగోలు చేయలేకపోతున్నారు. గతంలో ఆప్కో ద్వారా బేలు రూ.60 వేలకు సరఫరా చేసేవారు. ఇప్పడు బయట మార్కెట్‌లో రూ.62 వేలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. చేనేత సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. 2018లో పాలకవర్గాల గడువు ముగిసింది. వైసీపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీలు వేసి రెండు మూడు సొసైటీలకు ఒక అధికారిని నియమించి చేతులు దులుపుకుంది. ఈ ప్రభావం కూడా సొసైటీల నిర్వహణపై పడింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ఆప్కోను కోరాం

సొసైటీల్లో ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆప్కోను కోరాం. క్షేత్రస్థాయిలో వస్త్రాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల సూచనలతో చర్యలు చేపడతాం. జిల్లాలో సుమారు 800 మంది చేనేత కార్మికులు ఉన్నారు. సహకార సంఘాలకు రూ.కోటీ 50 లక్షల వరకు బకాయి ఉంది. కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తాం.

- ఆర్వీ మురళీకృష్ణ, ఏడీ, చేనేత జౌళిశాఖ, విజయనగరం

ఎలా బతకాలి

చేస్తున్న పని గిట్టుబాటు కావడం లేదు. నేసిన వస్త్రం అమ్మకానికి నోచుకోవడం లేదు. మేము తయారు చేసి విక్రయించిన వస్త్రాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా అయితే మేము ఎలా బతకాలి. ఉన్న వృత్తిని వదులుకోలేక.. ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాం.

- నాగమణి, చేనేత కార్మికురాలు, పెనుబాక, రాజాం మండలం

మరో ఉపాధి లేదు

మాకు ఈ వృత్తి తప్పించి మరొకటి తెలియదు. సొసైటీలు ఏర్పాటుచేసినా ఆశించిన స్థాయిలో నేత పని గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రకటనల వరకూ కాకుండా అమలుచేసి చూపించాలి. అప్పుడే చేనేత రంగానికి న్యాయం జరుగుతుంది.

- పుష్పవతి, చేనేత కార్మికురాలు, పెనుబాక, రాజాం మండలం

వ్యవసాయ పనులకు వెళ్తున్నాం

చేనేత పనులు గత మూడు నెలలుగా నిలిపివేయడంతో కుటుంబంతో పస్తులు ఉండలేక వ్యవసాయ పనులకు వెళ్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. మాకు రావాల్సిన బకాయిలు చెల్లించేవిధంగా ప్రభుత్వం సహకారం అందించాలి.

- కాసిన మంజు, చేనేత కార్మికురాలు, పెనుబాక, రాజాం

Updated Date - Dec 08 , 2025 | 12:09 AM