Irrigation Water పనులు పూర్తికావు.. సాగునీరు అందదు!
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:07 AM
Works Remain Unfinished… Irrigation Water Won’t Reach! పార్వతీపురం మండలంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. వాటి పనులు ఎప్పటికి పూర్తవుతాయో.. ఇంకెప్పటికి సాగునీరు అందిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
అధ్వానంగా కాలువలు
ఆయకట్టుదారులకు తప్పని ఇబ్బందులు
ఏటా వరుణుడిపైనే ఆధారం
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం రూరల్, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. వాటి పనులు ఎప్పటికి పూర్తవుతాయో.. ఇంకెప్పటికి సాగునీరు అందిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం వాటి నిర్వహణపై దృష్టి సారించలేదు. కాలువలను సైతం పట్టించుకోలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అడారుగెడ్డ, జంఝాతి హైలెవెల్ కెనాల్, వరహాల గెడ్డ పరిధిలో ఆయకట్టుదారులు సాగునీటికి కటకటలాడుతున్నారు. ఏటా వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకో వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
అడారుగెడ్డ రిజర్వాయర్
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అడారుగెడ్డ వద్ద రిజర్వాయర్ నిర్మించారు. సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా కనీసం ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు మారినా.. వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. రూ. రెండు కోట్ల అంచనాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.ఐదు కోట్లు వెచ్చించారు. అయినప్పటికీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదు. అడారుగెడ్డ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే డీకేపట్నం, తాళ్లబురిడి, గోచక్క, బుదురువాడ తదితర పంచాయతీల రైతుల సాగునీటి ఇక్కట్లు తీరుతాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే మరికొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఉంది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టును ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు.
జంఝావతి హైలెవెల్ కెనాల్...
జంఝావతి హైలెవెల్ కెనాల్ ద్వారా సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాల రైతులు వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నుంచి పాలకులు చెప్పుకొస్తున్నారు. కాని నేటికీ హైలెవెల్ కెనాల్ పనులు పూర్తికాకపోవడంతో ఆయా మండలాల్లో వ్వసాయ భూములకు సాగునీరు అందడం లేదు. జంఝావతి హైలెవెల్ కెనాల్ కోసం లక్ష్మీనారాయణపురం, తాళ్లబురిడి, పెదమరికి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు తమ విలువైన భూములను త్యాగం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో రైతన్నలు మండిపడుతున్నారు.
వరహాలగెడ్డ పరిస్థితి ఇదీ..
వరహాలగెడ్డ ప్రాజెక్టు ద్వారా సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 300 ఎకరాలకు కూడా నీరు అందించలేని దుస్థితి. ఈ ప్రాజెక్టు షట్టర్లు పూర్తిగా పాడై పోయాయి. కాలువల నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అవి పిచ్చిమొక్కలతో నిండాయి. కాలువ పనులుచేపడితే వందల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నప్పటికీ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు.