Positive Results సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:26 PM
Working in Coordination Yields Positive Results సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మార్పు అనేది ఆగదని, మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.
పార్వతీపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మార్పు అనేది ఆగదని, మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ లక్ష్యం పెద్దదైనప్పుడు.. దానికి తగ్గ ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి సామాన్యుడి దరికి చేరుతుంది. మండల ప్రత్యేకాధికారి, గ్రామస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పలు శాఖల్లో గ్రేడింగ్ పెంచేందుకు మండల అభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో 14 మండలాలు ఏ గ్రేడ్‌లో ఉన్నాయి. పాచిపెంట బీ గ్రేడ్‌లో ఉంది. జీపీఏ 80 శాతం ప్రగతి సాధించింది. గతేడాది 272 రైతు సేవా కేంద్రాల ద్వారా రూ.3,143 కోట్లు విలువ గల ధాన్యాన్ని సేకరించాం. 2025-26లో రూ.3,730 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.’ అని తెలిపారు. ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్స్ రన్నింగ్‌లో నైపుణ్యం చూపిన అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరుల పాల్గొన్నారు.
ప్రతి మండలంలో ఒక పిక్నిక్ పాయింట్
‘ప్రతి మండలంలో ఒక పిక్నిక్ పాయింట్ కచ్చితంగా ఉండాలి. ప్రతి ఎంపీడీవో వారి పరిధిలోని ప్రముఖ దేవాలయాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్స్‌ను గుర్తించాలి. సుమారు రెండు లక్షల మంది పర్యాటకులు ఈ సీజన్‌లో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో రిజిస్ర్టేషన్ల సంఖ్య, అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరగాలి. పీఎం జన్‌మన్, పీఎంఏవై కింద 9,438 ఇళ్లకు గాను, 8 వేలు గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి. తగ్గిన జీఎస్‌టీకి అనుగుణంగా వస్తు, వాహన విక్రయాలు ఉండాలి. దీనిపై వాణిజ్య పన్నులశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి. ప్రతి శుక్రవారం సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వాట్సాప్ గవర్నెస్‌పై అవగాహన కల్పించాలి. అని కలెక్టర్ తెలిపారు.
‘పది’లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
‘పదో తరగతి చదివే ప్రతి విద్యార్థి పాసవ్వాలి. టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి. జిల్లా అధికారులు తప్పనిసరిగా సంక్షేమ వసతిగృహాలను సందర్శించాలి. అక్కడ వసతులు, పరిసరాల పరిశుభ్రత, ముస్తాబు, నాణ్యమైన విద్య, ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఫ్రైడే డ్రైడే విధిగా అమలు చేయాలి.’ అని కలెక్టర్ తెలిపారు. ఒక కుటుంబం.. ఒక వ్యాపారవేత్త కార్యక్రమానికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని, దీనిపై జిల్లా స్థాయి వర్క్‌షాపు జరిగిందని ఆయన వెల్లడించారు.