Worker Shortage… కూలీల కొరత.. ఖర్చుల మోత!
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:01 PM
Worker Shortage… Costs Skyrocket జిల్లా రైతులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పంట చేతికందే సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. సకాలంలో కోతలు కోసేందుకు, పంటను కల్లాలకు తరలించేందుకు కూలీలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
కూలీలు దొరక్క అవస్థలు
తడిపిమోపుడవుతున్న వ్యవసాయ ఖర్చులు
రైతులపై అదనపు భారం
పాలకొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పంట చేతికందే సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. సకాలంలో కోతలు కోసేందుకు, పంటను కల్లాలకు తరలించేందుకు కూలీలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా వలసల జిల్లాగా పేరొందిన జిల్లాలో వ్యవసాయ పనులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. ఈ ప్రభావం వ్యవసాయ పనులపై పడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులు సుమారు 2 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట కోతకు సిద్ధం ఉంది. అయితే ఇందుకు అవసరమైన కూలీలు అందుబాటులో లేకపో వడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అందుబాటులో ఉన్న కూలీలను రోజువారీ ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీంతో పంట కోత, మోత, నూర్పుకు ఇచ్చే మొత్తాలు రైతులకు తడిసిమోపుడవుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులు కూడా అన్నదాతలను కలవరపెడుతోంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు అడిగే మొత్తాలను వెచ్చించి వ్యవసాయ పనులు చేయిస్తున్నారు. మరి కొంతమంది రైతులు అందుబాటులో ఉన్న యంత్రాలను వినియోగించుకొని ఖరీఫ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇది కొంతవరకు గిట్టుబాటు అవుతున్నప్పటికీ జిల్లాలో అన్ని చోట్టా యంత్రా లను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
వ్యవసాయ ఖర్చులు ఇలా..
ప్రస్తుతం జిల్లాలో ఎకరా కోతకు కూలీలు రూ.5 వేల నుంచి రూ.6 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. కోత కోసిన పంటను కుప్ప వేసేందుకు అదే పొలంలో అయితే ఎకరాకు రూ.4 వేలు ఖర్చవుతుంది. సమీపంలో ఉన్న కల్లాలకు తరలించేందుకైతే వీటి ఖర్చు మరింత భారమవుతుంది. పంట నూర్పుడి యంత్రాలు అందుబాటులో ఉన్నా ఎకరాకు రూ.2 వేలు పైనే ఖర్చు అవుతుంది.
అనువైన పరిస్థితులు లేక..
జిల్లా రైతులు పూర్వం నుంచి మోసు పద్ధతిలోనే వ్యవసాయాన్ని చేస్తున్నారు. యంత్ర పరికరాలను వినియోగించే అనువైన పరిస్థితి మన్యంలో కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అన్ని ప్రాంతాలకు అవసరమైన సాగునీరు సరఫరా కావడం లేదు. భౌగోళికంగా వ్యవసాయ భూములు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేవు. ఉదాహరణకు తోటపల్లి ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలల్లో భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. దీంతో ఆయా ప్రాంత రైతులు వరి కోత కోసిన తర్వాత రబీ కింద అపరాల సాగు చేస్తుంటారు. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో ఆ పరిస్థితి లేదు. యంత్రంతో కోత కోస్తే ఆ తర్వాత అపరాలను జల్లే అవకాశం ఉండదు. వీరికి వరి పంట కోత అనంతరం సాగునీరు అందడం గగనమే. దీంతో చేసేది లేక ప్రాజెక్టు శివారు ప్రాంత రైతులు వరి పంట కోత దశలో ఉన్నప్పుడు మినుము, పెసర, కట్టెజనుం ఇతర విత్తనాలను జల్లుతారు. అలా జల్లిన వ్యవసాయ భూముల్లో యంత్రాల ద్వారా వరి పంట కోత కోస్తే అపరాల పంట నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు యంత్ర పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్నారు. దీనిపై పాలకొండ ఏవో ప్రసాదరావును వివరణ కోరగా.. ‘ వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు సరఫరా చేసేందుకు వీలుగా ప్రతిపాదిస్తాం. నిధులు మంజూరైతే యంత్ర పరికరాలను రాయితీలో అందిస్తాం.’ అని తెలిపారు.