Work with Commitment నిబద్ధతతో పనిచేయండి
ABN , Publish Date - May 15 , 2025 | 10:57 PM
Work with Commitment నిబద్ధతతో పనిచేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. శిక్షణ కోసం జిల్లాకు కేటాయించిన 38 మంది ప్రొబెషనరీ ఎస్‌ఐలు గురువారం మర్యాద పూర్వకంగా ఎస్పీని కలిశారు.
బెలగాం, మే 15 (ఆంధ్రజ్యోతి) : నిబద్ధతతో పనిచేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. శిక్షణ కోసం జిల్లాకు కేటాయించిన 38 మంది ప్రొబెషనరీ ఎస్‌ఐలు గురువారం మర్యాద పూర్వకంగా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారితో ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు సాగాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలన్నారు. ప్రజలతో మమేకమవ్వాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని తెలిపారు. వారికి కేటాయించిన ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా విధులు నిర్వర్తించాలో తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలను సందర్శించాలని, అక్కడ ప్రజలతో సమావేశమై వారికి సైబర్, నక్సలిజం, మత్తు పదార్థాలు, సారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.