Share News

But Where Are the Wages? పనులు సరే.. వేతనాలేవీ?

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:15 PM

Work is Done… But Where Are the Wages? జిల్లాలో ఉపాధి వేతనదారులు ఆకలితో అల మటిస్తున్నారు. గత కొద్ది నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పనుల ప్రదేశంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడం లేదు. చాలాచోట్ల నిలువ నీడ కొరవడడంతో వేతనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

  But Where Are the Wages?  పనులు సరే.. వేతనాలేవీ?
సాలూరు మండలంలో ఫాంపాండ్‌ పనులు చేపడుతున్న వేతనదారులు

సుమారు రూ.57 కోట్ల వరకు బకాయిలు

తీవ్ర ఇబ్బందుల్లో ఉపాధి వేతనదారులు

మెటీరియల్‌ కాంపోనెంట్‌ పెండింగ్‌ బిల్లులు రూ.90.90 కోట్లు

కేంద్రం నుంచి విడుదల కాని నిధులు

పార్వతీపురం, ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి వేతనదారులు ఆకలితో అల మటిస్తున్నారు. గత కొద్ది నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పనుల ప్రదేశంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడం లేదు. చాలాచోట్ల నిలువ నీడ కొరవడడంతో వేతనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా పనులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. సకాలంలో వేతనాలు అందక.. పస్తులతో వారు కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. వాస్తవంగా ఉపాధి కూలీలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు పనుల ప్రాప్తికి బిల్లులు అప్‌లోడ్‌ చేస్తున్నా.. కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో వేతనదారులు వేతనాల కోసం ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 1.94 లక్షల మేర జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 1.90 లక్షల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తంగా 1.33 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. 100 రోజులు పూర్తయిన వారు 46,227 మంది ఉన్నారు. జిల్లాలో 100 రోజుల పనులు పూర్తయిన కుటుంబాలు 46,227గా అధికారులు గుర్తించారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి వేతన దారులకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకు వేతనాల బకాయిలు సుమారు రూ.57 కోట్లు ఉంటుందని అంచనా. 2024-2025కి సంబంధించి 49.55 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపట్టిన పనులకు కూడా చెల్లింపులు జరగడం లేదు. వాటి పెండింగ్‌ బకాయిలు రూ.90.90 కోట్లు వరకు ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ నిధులు ఎప్పటికి విడుదలవుతాయి.. ఇంకెప్పటికీ చెల్లి స్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన వారు లబోదిబో మంటున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో వడ్డీలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు ముందుకు సాగడం కష్టమని వెండర్‌దారులు స్పష్టం చేస్తున్నారు.

పస్తులతో అవస్థలు

ఉపాధి పనులు చేపట్టే ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో ఎండలోనే పనులు చేపడుతున్నాం. మరోవైపు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే మా లాంటి పేదలు బతికేదెలా? దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలి.

- లక్ష్మి, ఉపాధి కూలీ, కొమరాడ మండలం

================================

ఎప్పుడు చెల్లిస్తారో..

ఉపాధి పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు వేతనాలు అందించలేదు. ఎప్పుడు చెల్లిస్తారో తెలియడం లేదు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. గ్రామాల్లో నిత్యావసర సరుకులు కూడా ఎవరూ అరువుపై ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.

- అప్పలనాయుడు, వేతనదారుడు, పార్వతీపురం

================================

త్వరలోనే చెల్లింపులు

ఉపాధి వేతనదారులకు త్వరలోనే వేతనాల చెల్లింపులు జరుగుతాయి. నిధులు విడుదలైన వెంటనే వారి ఖాతాలకు జమవుతాయి. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా చేపట్టిన పనులకు కూడా త్వరలోనే బిల్లులు చెల్లింపులవుతాయి.

-రామచంద్రరావు, డ్వామా పీడీ

Updated Date - Apr 16 , 2025 | 11:15 PM