Share News

‘Manyam’ Representatives ‘మన్యం’ ప్రజాప్రతినిధులను ఆహ్వానించరా?

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:46 PM

Won’t the ‘Manyam’ People’s Representatives Be Invited? ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కేవలం విజయనగరం జిల్లాకే పరిమితమా? పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జడ్పీ ఉన్నతాధికారులు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  ‘Manyam’  Representatives   ‘మన్యం’ ప్రజాప్రతినిధులను ఆహ్వానించరా?
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కేవలం విజయనగరం జిల్లాకే పరిమితమా? పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జడ్పీ ఉన్నతాధికారులు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా జడ్పీ సర్వసభ్య సమావేశ నిర్వహించే సమయంలో మన్యం జిల్లా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాల్సి ఉంది. సమావేశానికి ఒక రోజు ముందు కూడా వారికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే జడ్పీ అధికారులు అలా చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి స్వయంగా జడ్పీ సీఈవో ఆహ్వానించాల్సి ఉంది. సమావేశానికి ముందు రోజు ఫోన్‌ ద్వారా మరోసారి గుర్తు చేయాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో ఏదీ చేయకపోవడంతో మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి సైతం జడ్పీ సమావేశానికి హాజరుకాలేదని తెలిసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ కారణంగానే వెళ్లలేదని సమాచారం. జడ్పీ పాలకవర్గం వైసీపీ చేతిలో ఉండడం వల్ల రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. గతంలో జడ్పీ సర్వసభ్య సమావేశంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సంధ్యారాణితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడంతో కీలకంగా ఉన్న వారిని కావాలనే సమావేశానికి ఆహ్వానించలేదనే ఆరోపణలు లేకపోలేదు. కాగా ఉమ్మడి జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. కానీ ఒక్కసారి కూడా నిర్వహించలేదు.

వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం

విజయనగరం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీ వేరిఫికేషన్‌ పేరుతో కొంతమంది పింఛన్‌దారులు బెంబేలెత్తిపోతున్నారని ఓ సభ్యుడు ప్రస్తావించగా మంత్రి కొండపల్లి సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు సక్రమంగా అందుతున్నాయన్నారు. మధ్యలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కల్పించుకుని ... ప్రతి విషయానికీ గత ప్రభుత్వం అనొద్దని, ప్రస్తుత ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్‌దారులను భ్రయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. ఇది మినహా జడ్పీ సమావేశం ప్రశాంతంగా జరిగింది. వేసవిలో తాగునీటి సమస్యపైనే ఎక్కువ సమయం చర్చ జరిగింది. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం జడ్పీ సమావేశ భవనంలో అరగంట ఆలస్యంగా 11 గంటలకు ప్రారంభమైంది. జడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ అంబేడ్కర్‌తో పాటు పార్వతీపురం మన్యం కలెక్టర్‌ శ్యామ్‌కుమార్‌ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో కురుపాం నియోజకవర్గంలో ఏకలవ్య పాఠశాలపై మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీలు ప్రస్తావించారు. కలెక్టర్‌ శ్యామ్‌కుమార్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలికంగా వున్న పాఠశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆ తర్వాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకాలు చాలా ఉన్నాయని, అవన్నీ చెప్పుకుంటే సమావేశం సమయం కూడా చాలదన్నారు. పింఛన్ల విషయంలో గత ప్రభుత్వం అనర్హులకు పెద్దపీట వేసిందన్నారు. అర్హులకు అందాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం దానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల పెన్షన్‌లు తొలగించబోమని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వివరించారు.

తాగునీటి సమస్య లేకుండా చూడండి

జడ్పీ సమావేశం అజెండాలో తొలి అంశంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంపై సమీక్ష జరిగింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఎస్‌ఈలు తమ జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, వేసవి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై వివరించారు. తాగునీటి అవసరాల కోసం అత్యవసరంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ఉపాధి హామీ పథకంపై సమీక్షలో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు మాట్లాడుతూ ఉపాధి వేతనాల బకాయిల గురించి ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉపాధి వేతనాలు ఈ నెలలోనే చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కాగా జడ్పీ సర్వసభ్య సమావేశంలో 11 శాఖలపై సమీక్ష జరిగింది.

Updated Date - Apr 09 , 2025 | 11:46 PM