Share News

Women's Must Improve మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:26 PM

Women's Quality of Life Must Improve జిల్లాలో మహిళల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. మిషన్‌ మత్స్యశక్తి, జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌, గిరిబజార్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

Women's  Must Improve మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. మిషన్‌ మత్స్యశక్తి, జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌, గిరిబజార్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. మత్స్య సంపద ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చని కలెక్టర్‌ తెలిపారు. మిషన్‌ మత్స్యశక్తి ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సాయం అందించి.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. జిల్లాలో మత్స్యసంపద ద్వారా ప్రస్తుతం రూ.49 కోట్లుగా ఉన్న జీడీపీని రూ.600 కోట్లుకు పెరగాలని సూచించారు. జీడిపిక్కల ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు సిద్ధం కావాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవను ఆదేశిం చారు. జీడిపప్పు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. గిరి బజారు వాహనాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో సరుకులు విక్రయించాలని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలని, గురువారం జిల్లా వ్యాప్తంగా ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. డిజిటల్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వీఆర్‌వోలు, ఉపాధ్యాయులు ఈ డ్రైవ్‌లో పాల్గొనాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే 4,132 మంది ఒకటో తరగతి విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు.

నేడు నిషా ముక్త్‌ భారత్‌ ర్యాలీ

నిషా ముక్త్‌భారత్‌ కార్యక్రమాన్ని గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తుమందుల జోలికి యువత వెళ్లకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి మండల, మున్సిపల్‌ పరిధిలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ర్యాలీ నిర్వహించాలన్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని తెలిపారు.

రేపు సుపరిపాలన కార్యక్రమం

సుపరిపాలన కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.

Updated Date - Jun 25 , 2025 | 11:26 PM