ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:17 AM
పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు.
రాజాం రూరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పెనుబాక జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రాజాం పొలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఎం.జె.వలస గ్రామానికి చెందిన జగదీశ్వరి (45) వెలుగులో వీఓఏగా పని చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలకు సంబంధించి రాజాంలోని కెనరా బ్యాంకు సిబ్బందితో మాట్లాడేందుకు శుక్రవారం వచ్చిన ఆమె పని ముగించుకుని అదే బ్యాంకులో సీఎస్‌వ్డోగా పనిచేస్తున్న తన గ్రామానికి చెందిన రామారావుతో కలిసి స్కూటీపై తిరిగి వెళ్తున్నారు. రాజాం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న వీరి స్కూటీని వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ పెనుబాక జంక్షన్ వద్ద బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన రామారావును చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ప్రమాద స్థలం వద్ద పరామర్శించారు. ప్రమాద వివరాలను అతనిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజాం పొలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గూడ్స్ ఢీకొని వ్యక్తి...
లక్కవరపుకోట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రంగరాయపురాన్ని ఆనుకొని ఉన్న అగ్రహారం బంద వద్ద గూడ్స్ రైలు ఢీకొని బత్తిన అప్పారావు (55) మృతిచెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ వి.బాలాజీరావు తెలిపారు. మార్లాపల్లి గ్రామానికి చెందిన అప్పారావు మృతిచెందాడు. పిల్ల అగ్రహారంలోని తన కుమార్తె ఇంటికి వచ్చాడని... తిరిగి తన స్వగ్రామం మార్లాపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కిరండోల్ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్ ఢీకొట్టినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం మహరాజా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.