పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:54 PM
: మండల కేంద్రం వేపాడలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఓ మహిళ పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకుని, నిప్పటించుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది.
వేపాడ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం వేపాడలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఓ మహిళ పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకుని, నిప్పటించుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి మంటలను ఆర్పేశారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, పోలీసుల వివరాలు మేరకు.. శృంగవరపుకోట మండలం కాపుసోంపురం గ్రామానికి చెందిన రొంగలి లక్ష్మి (25)అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడికి కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై ఆ యువకుడి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతను లక్ష్మిని దూరం పెట్టాడు. దీనిపై లక్ష్మి ఇటీవల వల్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సుదర్శన్ ఇరువర్గాలను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌కు పిలిపించారు. వారి కుల పెద్దల సమక్షంలో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి వినలేదు. ‘ఆ యువకుడిని నావద్ద మూడు రోజులు, ఆయన భార్య వద్ద మూడు రోజులు ఉండమని చెప్పండి. అలాగైతే నేను ఒప్పుకుంటా. లేదంటే కుదరదు.’అని చెప్పింది. దీనికి ఆ యువకుడి కుటుంబం అంగీకరించలేదు. ఎవరి కుటుంబంతో వారు ఉండడం శ్రేయస్కరమని పెద్దలు కూడా సలహా ఇచ్చారు. దీనికి అంగీకరించని లక్ష్మి ఆగ్రహంతో స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయి, రోడ్డుపై ఉన్న ఓ షాపులో పెట్రోల్ కొనుగోలు చేసుకుని వచ్చింది. పోలీసు స్టేషన్ ఎదురుగా తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న స్థానికులు, ఇద్దరు కానిస్టేబుళ్లు గమనించి వెంటనే సమీపంలో ఉన్న దుప్పటి, గోనె సంచులను లక్ష్మిపై కప్పి మంటలను ఆర్పారు. అనంతరం 108కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం లక్ష్మిని శృంగవరపుకోట సీహెచ్‌సీకి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.