ఎవరో వస్తారని ఎదురు చూడకుండా..
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:19 AM
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా భూపాలపురం గ్రామ రైతులు తమ పంట పొలాలకు స్వచ్ఛందంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు.
గుర్ల, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా భూపాలపురం గ్రామ రైతులు తమ పంట పొలాలకు స్వచ్ఛందంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని రైతులందరూ చందాలు వేసుకుని మొత్తం రూ.13లక్షలు సమకూర్చుకున్నారు. రహదారి నిర్మాణానికి గాను మిగులు భూముల కొనుగోలుకు రూ.10లక్షలు వినియోగించారు. మిగతా రూ.3లక్షలతో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ఇరువైపులా మట్టివేసి బాగుచేసుకున్నారు. సుమారు 20 కుటుంబాల రైతులు కలిసికట్టుగా రహదారిని నిర్మించుకున్నారు. దీంతో సుమారు 200 ఎకరాల విస్తీర్ణం గల మెట్టు భూములకు రహదారి సౌకర్యం కలిగింది. ఈ రహదారికి తిత్రి రోడ్డుగా పేరు ఉంది. గతంలో ఈ రహదారి సమస్యను ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని రైతులు వాపోయారు.