Share News

అక్విడక్ట్‌ పూర్తికాక.. సాగునీరు అందక

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:18 AM

వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని అక్విడక్ట్ట్‌ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అక్విడక్ట్‌ పూర్తికాక.. సాగునీరు అందక
నిలిచిన ఎడమ కాలువ అక్విడక్ట్‌ నిర్మాణం

- బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిన పనులు

- రైతులకు తప్పని ఇబ్బందులు

- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నపం

మక్కువ రూరల్‌, నవంబరు 27(ఆంఽఽధ్రజ్యోతి): వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని అక్విడక్ట్ట్‌ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మక్కువ మండలంలో 14,550 ఎకరాలు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో 6,127 ఎకరాలు మొత్తం 24,700 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. సుమారు రూ.11కోట్ల వ్యయంతో పది పిల్లర్లతో నిర్మించిన అక్విడక్ట్‌ 2008లో కుప్పకూలిపోయింది. దీంతో ఎడమ కాలువ పరిధిలోని 8వేల ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు గోముఖి లింక్‌చానల్‌ నిర్మించి ఎడమ కాలువకు అనుసంధానం చేశారు. ఈ చానల్‌ ద్వారా వచ్చే నీటిని ఎడమ కాలువలోకి విడిచిపెట్టి తద్వారా పంట పొలాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ నీరు కూడా పూర్తిగా సరఫరా కాకపోవడంతో అధికారులు వెంగళరాయసాగర్‌ రెండో కిలోమీటర్‌ వద్ద కొత్తగా అక్విడక్ట్‌ను నిర్మించేందుకు 2012లో నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు పది పిల్లర్లతో పాటు దోనెను నిర్మించాల్సి ఉంది. 2015 వరకు పనులు జరిగాయి. ఆ తరువాత నిధుల కొరత ఏర్పడడంతో పనులు నిలిచిపోయాయి. ఐదేళ్ల వరకు ఈ పనుల్లో ఎటువంటి కదలిక కనిపించలేదు. 2020లో వెంగళరాయ ప్రాజెక్టు ఆధునికీకరణకు జైకా నిధులు రూ.63కోట్లు మంజూరయ్యాయి. 2021లో అక్విడక్ట్‌ పనులు, 2022లో కాలువ లైనింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అక్విడక్ట్ట్‌లో నాలుగు పిల్లర్లు, ఐదు శ్లాబ్‌లను పూర్తి చేశారు. కుడి ప్రధాన కాలువలో 700 మీటర్ల వరకు లైనింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించకపోవడంతో ఈ పనులు మళ్లీ నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం మంజూరైన నిధులను వైసీపీ సర్కారు వేరే పనులకు మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. వెంగళరాయ ప్రాజెక్టు ప్రారంభం నుంచి నేటివరకూ ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని శివారు భూములకు ఇంతవరకు పట్టుమని పది ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకొని అక్విడక్ట్‌ నిర్మాణం పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీందించాలని రైతులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఈ డిసెంబరులో పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. జైకా నిధులు విడుదల చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెలాఖరుకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం. ఆ వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం.

-డి.సురేష్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు

Updated Date - Nov 28 , 2025 | 12:19 AM