Medical Services వైద్య సేవలకు ఆటంకం కలగకుండా..
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:28 PM
Without Disrupting Medical Services ఇన్‌సర్వీస్ కోటా, ఇతర డిమాండ్ల సాధన కోసం పీహెచ్‌సీ వైద్యాధికారులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
పార్వతీపురంజియ్యమ్మవలస, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): ఇన్‌సర్వీస్ కోటా, ఇతర డిమాండ్ల సాధన కోసం పీహెచ్‌సీ వైద్యాధికారులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత నెల 26వ నుంచి వారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం పార్వతీపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించనున్నారు. 3న విజయవాడలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. వాస్తవంగా జిల్లాలో ఉన్న 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 74 మంది వైద్యాధికారులు విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం వైద్యాధికారుల పోరు బాట పట్టడంతో వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో భాస్కరరావు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త జి.నాగభూషణ రావుతో చర్చించి.. 20 మంది వైద్యాధికారులు, ఆయుష్ నుంచి 14 మంది, మరో 8 మంది వైద్యులను పీహెచ్‌సీలకు పంపించారు. ఆసుపత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ఎంఎల్ హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులకు కచ్చితమైన ఆదేశాలు ఇస్తూ వారి సెలవులను రద్దు చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షణ చేసేలా ఓ టీము ఏర్పాటు చేశారు. అన్ని పీహెచ్‌సీల్లో అత్యవసర కేసులు మినహా మిగిలిన రోగులను పరిశీలించిన అనంతరం వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో మంగళవారం తెలిపారు.