Without Bills.. బిల్లులు రాక.. ఇళ్లు కట్టలేక!
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM
Without Bills.. Houses Left Unfinished! మక్కువ మండలంలో గృహ నిర్మాణదారుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పులు తీర్చలేక.. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. బిల్లులు మంజూరులో గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిపై నిర్లక్ష్యం
నిధులు మంజూరు చేయని వైసీపీ సర్కారు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
మక్కువ రూరల్, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలంలో గృహ నిర్మాణదారుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పులు తీర్చలేక.. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. బిల్లులు మంజూరులో గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి సుమారు 1600 గృహాలు మంజూరుచేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.2 లక్షలు, పీఎం ఆవాస్ యోజన కింద రూ.2.50 లక్షలు కేటాయిం చారు. అయితే 1052 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. వివిధ నిర్మాణ దశల్లో మిగిలిన గృహాలకు బిల్లులు చెల్లించేందుకు ఆ శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే ఈలోపుగా ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. 548 మందికి సంబంధించిన బిల్లులు గత వైసీపీ సర్కారు చెల్లించలేదు. 2023లో సార్వత్రిక ఎన్నికల ముందు పెండింగు బిల్లులు చెల్లిస్తామంటూ రెండు దఫాలు సర్వేకూడా చేయించింది. కానీ లబ్ధిదారులకు మాత్రం బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో నేటికీ ఆ ఇళ్లు నిర్మాణం పూర్తి కాలేదు. పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తుండడంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు మరోసారి సర్వే చేపట్టి వివరాలు సేకరించారు. అయితే ఏడాది గడుస్తున్నా పాత బిల్లులకు మోక్షం కలగలేదు. మండలంలోని 21 పంచాయతీల పరిధిలోని ఒక్కో గ్రామంలో 10 నుంచి 30 మంది వరకు బాధితులున్నారు. ఒక్క మక్కువ మండలంలోనే రూ.2కోట్ల వరకు బిల్లుల బకాయిలున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. దీనిపై హౌసింగ్ ఏఈ సింహాచలాన్ని వివరణ కోరగా.. మక్కువ మండలంలో 548 మంది లబ్ధిదారులకు సుమారు రూ.కోటి 90లక్షల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎప్పుటికప్పుడు నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపుతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాగానే లబ్ధిదారులకు చెల్లిస్తామని వెల్లడించారు.
అప్పు పుట్టడం లేదు..
పీఎం ఆవాస్ యోజన కింద 2018లో నాకు ఇల్లు మంజూరైంది. అయితే రూ.లక్ష మాత్రమే బిల్లు మంజూరైంది. మిగిలిన రూ.లక్షకు బిల్లు రాకపోవడంతో ఇంటినిర్మాణం పూర్తిచేసుకోలేక పోయాను. అప్పుకూడా పుట్టడం లేదు. ప్రభుత్వం స్పందించి పెండింగు బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
- పొట్టంగి శంకర్రావు, దబ్బగెడ్డ
============================
వడ్డీలు కట్టలేకపోతున్నా..
పీఎం ఆవాస్ యోజన కింద కింద ప్రభుత్వం గ్రాంటు మంజూరుచేసింది. ఇంటి పని ప్రారంభమయ్యాక కేవలం ఒక్క బిల్లు మాత్రమే వచ్చింది. మిగిలిన బిల్లు ఇంతవరకు చెల్లించ లేదు. శ్లాబు వరకు మాత్రమే గృహ నిర్మాణం పూర్తయింది. ఇందు కోసం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నా.
- రౌతు నాగరాజు, కోన