పరిష్కరిస్తారనే ఆశతో..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:20 AM
వీరంతా శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌కు వచ్చిన జనం.
- ఎమ్మెల్యేల ప్రజాదర్బార్‌కు కుప్పలు తెప్పలుగా వినతులు
- వ్యక్తిగత సమస్యల దరఖాస్తులే ఎక్కువ
- ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని విన్నపం
- గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పేరుకుపోయిన సమస్యలు
- ఈ ఫొటో చూసారా..! వీరంతా శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌కు వచ్చిన జనం. పలు సమస్యలకు సంబంధించిన వినతులను పట్టుకొని ఉదయం 11గంటల నుంచి వరుస కట్టారు. వీరందరి నుంచి దరఖాస్తులు స్వీకరించేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. ఇందులో ఒకట్రెండు సామూహిక సమస్యలు తప్ప మిగిలినవన్నీ వ్యక్తిగత సమస్యలే. మొత్తం 631 దరఖాస్తులు రాగా ఇందులో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని 253, సామాజిక పింఛన్లు ఇవ్వాలని 212 దరఖాస్తులు వచ్చాయి. జిందాల్ భూసేకరణలో జరిగిన అన్యాయానికి సంబంధించి వ్యక్తిగతంగా న్యాయం చేయాలని 131 మంది వినతులు అందించారు.
శృంగవరపుకోట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): శాసన సభ్యులు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి వ్యక్తిగత సమస్యలపైనే ఎక్కువగా వినతులు వస్తున్నాయి. అదే విధంగా అధికారులు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి కూడా వ్యక్తిగత సమస్యలపైనే అధికంగా అర్జీలు అందుతున్నాయి. గ్రామ సమస్యలు, ఇతర సామూహిక సమస్యలపై వినతులు ఇచ్చేవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. వారి వినతులను అప్పట్లో పరిష్కరించేవారు కరువయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో ప్రజలు ఎమ్మెల్యేలకు, అధికారులకు వినతులు ఇచ్చేందుకు బారులుతీరుతున్నారు.
ఇళ్ల స్థలాల కోసం..
గత వైసీపీ ప్రభుత్వం ఊర్లకు ఊర్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పింది. ఇళ్ల పట్టాల కోసం ఎక్కడెక్కడో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను సేకరించింది. గ్రామాలకు దూరంగా కొండలు, గుట్టలు, చెరువులు వంటి స్థలాల్లో లేఅవుట్లు వేసింది. ఇవేవీ నివాస యోగ్యంగా ఉండకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు పట్టాదారులు ఇష్టపడలేదు. పైగా సెంటున్నర స్థలంలో ఏం ఇల్లు కడతామని చాలామంది లబ్ధిదారులు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గ్రామాలకు దగ్గరగా, నివాసయోగ్యంగా ఉండే ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు గ్రీవెన్స్‌ను నిర్వహించినా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక పింఛన్లపై
సామాజిక పింఛన్‌లు మంజూరు చేయాలని ప్రజల నుంచి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ దరఖాస్తులు వందల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక రేషన్ కార్డుపై ఒక సామాజిక పింఛన్‌ను మాత్రమే అందిస్తుంది. దివ్యాంగులు ఉంటే అదనంగా మంజూరు చేస్తుంది. రేషన్‌కార్డులో ఉన్న సభ్యుల్లో ఒకరిద్దరు పింఛన్‌కు అర్హత ఉన్నవారే. ఇలా అర్హత ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒకరికే పింఛన్ అందుతుంది. అర్హత ఉన్నప్పటికీ మిగిలిన కార్డు సభ్యులు దరఖాస్తు చేసేందుకు ఆన్‌లైన్ కావడం లేదు. 2016లో టీడీపీ ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలతో హౌస్ హోల్డ్ సర్వే చేపట్టింది. దీని ప్రకారం గత వైసీపీ ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఒకే కుటుంబంగా నమోదై ఉన్న సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ వస్తుండడంతో మిగిలిన వారికి అన్యాయం జరుగుతుంది. హౌస్ హోల్డ్ సర్వేలో స్ల్పిట్ ఆప్షన్ ఇస్తేనే ప్రస్తుతం సామాజిక పింఛన్‌లకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రయోజనం చేకూరనుంది.
భూ సమస్యలు..
జిల్లాలో కొన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌తో పాటు ఎమ్మెల్యేల ప్రజా దర్బార్‌ల్లోనూ ఈ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా గ్రామాల్లో భూమి ఒకరి సాగులో ఉంటే దాని రికార్డు వేరొకరి పేరుపై ఉంటుంది. వీటిని రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేయడం లేదు. రికార్డుల్లో పేరున్న వ్యక్తి అంగీకరిస్తేనే ఆన్‌లైన్ చేస్తామని తేల్చిచెబుతున్నారు. రికార్డుల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని కొంత మంది ఇతరుల భూములను ఆక్రమిస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. చిక్కుముడిగా ఉన్న ఈ భూ వివాదాలను రెవెన్యూ అధికారులు తీర్చలేకపోతున్నారు. మరి కొంతమంది 22ఏలో ఉన్న ప్రభుత్వ భూములను జిరాయితీగా చెబుతున్నారు. వాటిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికిప్పుడు పరిష్కారం చూపడం సాధ్యంకాని సమస్యలు ప్రజా దర్బార్‌కు వస్తున్నాయి. ఇక్కడైతే పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో గంటల కొద్దీ నిరీక్షించి ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు ప్రజా ప్రతినిధులు ఏ విధంగా పరిష్కారం చూపుతారో చూడాలి మరి.