Share News

How Do We Reach the Fair? రోడ్లు ఇలా.. జాతరకు వెళ్లేదెలా?

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:40 PM

With Roads in This Condition… How Do We Reach the Fair? ఉత్తరాంధ్రుల కొంగు బంగారం.. కోర్కెల తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరకు సయమం సమీపిస్తోంది. మరో నెలరోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే శంబరకు వచ్చే ప్రధాన రోడ్ల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు.

  How Do We Reach the Fair? రోడ్లు ఇలా..  జాతరకు వెళ్లేదెలా?
సాలూరు-మక్కువ రోడ్డు ఇలా..

  • బాగుపడని రహదారులు

  • ఈ సారి భక్తులకు ఇక్కట్లు తప్పేనా?

  • నేడు ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

మక్కువ రూరల్‌, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల కొంగు బంగారం.. కోర్కెల తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరకు సయమం సమీపిస్తోంది. మరో నెలరోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే శంబరకు వచ్చే ప్రధాన రోడ్ల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు. వాటిపై దృష్టి సారించకపోతే ఈ సారి జాతరకు వచ్చే వారికి ఇక్కట్లు తప్పవు. నేడు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షించ నున్న నేపథ్యంలో రోడ్లపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని భక్తజనం కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 తేదీల్లో శంబర పోలమాంబ జాతరను నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే శంబర రహదారులు మాత్రం అధ్వానంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా సాలూరు, మక్కువ, బొబ్బిలి, పార్వతీపురం నుంచి శంబరకు వచ్చే రోడ్లన్నీ అడుగుకో గుంతతో దారుణంగా తయారయ్యాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి. రోడ్లు బాగోలేకపోవడంతో గత నాలుగు నెలలుగా సాలూరు-మక్కువ మధ్య ఆర్టీసీ బస్సులు కూడా నడవడం లేదు. దీంతో సాలూరు మండలంలో పది గ్రామాల ప్రజలు మక్కువ మీదుగా శంబర చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. రవాణా సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో బైక్‌తో కూడా రాకపోకలు సాగించలేన పరిస్థితి ఏర్పడింది. తరచూ వాహనదారులు గుంతల్లో చిక్కుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో సాలూరు-మక్కువ ప్రయాణమంటేనే చోదకులు బెంబేలెత్తిపోతున్నారు.

- వాస్తవంగా సాలూరు-మక్కువ రోడ్డు నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.56కోట్లు మంజూరయ్యాయి. అయితే రూ.5కోట్ల వరకు నిర్మాణం జరిగినా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో మూడేళ్ల కిందటే పనులు నిలిపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌కు రూ.4కోట్ల వరకూ పెండింగ్‌ బిల్లులు చెల్లించింది. 20 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్షాల కారణంగా నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు.

- శంబర జాతకు వచ్చే ప్రధాన మార్గాల్లో మక్కువ - బొబ్బిలి రోడ్డు కూడా ఎంతో కీలకం. ఈ మార్గం కూడా గుంతలతో నిండిపోయింది. ఏటా శంబర జాతర సమయంలో అధికారులు నామమాత్రంగా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత దాని నిర్వహణను పట్టించుకోవడం లేదు. వాహనాల రాకపోకలతో అనతికాలంలో రోడ్డు మళ్లీ స్థితికి చేరుతుంది. దీంతో ఏటా భక్తులకు ప్రయాణ ఇక్కట్లు తప్పడం లేదు.

- దశాబ్దాలు గడుస్తున్నా మక్కువ-బొబ్బిలి మార్గాన్ని డబుల్‌ లైన్‌గా మార్చడం లేదు. మరోవైపు నారసింహునిపేట, కన్నంపేట, ఎ.వెంకంపేట గ్రామాల పరిధిలో ద్విచక్ర వాహన దారులు, ఆటోలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఎంతోమంది గాయాలతో ఆసుపత్రిపాలవుతున్నారు. ఎ.వెంకంపేట సమీపంలో గుబేలు గెడ్డపై ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. శ్రీకాకుళం, విజయనగరం, ఎస్‌.కోట, పాలకొండ ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సులు ఇదే రోడ్డు నుంచి శంబరకు రాకపోకలు సాగించనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది.

- దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్‌ విజయకుమార్‌ను వివరణ కోరగా..‘ సాలూరు- మక్కువ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. సాలూరు నుంచి బాగువలస, పాయకపాడు, మక్కువ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5.50 కోట్లకు టెండర్లు పిలిచాం. కాగా పాత గ్రాంటు రూ.6కోట్లతో బాగువలస-పాయకపాడు రోడ్డు పనులు చేపడతాం.’ అని తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

శంబరలో శుక్రవారం పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి పర్యటించారు. జాతర నిర్వహణపై శనివారం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరు కానున్న నేపథ్యంలో చదురుగుడిలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఈవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ భరత్‌కుమార్‌, ఎంపీడీవో ఎన్‌.అర్జునరావును ఆదేశించారు.

Updated Date - Dec 12 , 2025 | 11:40 PM