It Can Turn Green Again మరమ్మతులు చేస్తే.. సస్యశ్యామలమే..
ABN , Publish Date - May 28 , 2025 | 12:11 AM
With Repairs, It Can Turn Green Again కురుపాంలో నూలుగెడ్డ మినీ రిజర్వాయర్ పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నాళ్లుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం కాలువల్లో పూడికతీత కూడా చేపట్ట లేదు. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు.
కాలువల్లో పూడికతీతలకూ నిధులు మంజూరు చేయని వైసీపీ
211 ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని నీరు
ఏటా వరుణుడిపైనే ఆధారం.. ఆందోళనలో రైతులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
కురుపాం, మే27(ఆంధ్రజ్యోతి): కురుపాంలో నూలుగెడ్డ మినీ రిజర్వాయర్ పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నాళ్లుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం కాలువల్లో పూడికతీత కూడా చేపట్ట లేదు. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. ఏటా రైతులు వరుణుడిపైనే ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది. సుమారు 25 ఏళ్ల కిందట కురుపాం గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్సియల్ పాఠశాల వెనుక భాగంలో నూలుగెడ్డ మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని నుంచి నాలుగు చెక్‌డ్యామ్‌ల ద్వారా సుమారు 211 ఎకరాలకు సాగునీరందేది. చెక్‌వాల్ ద్వారా కురుపాం ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న పొలాలకు, కస్పాగదబవలస, పాత కురుపాంలో భూములకు కూడా నీరు అందేది. అయితే గత కొన్నాళ్లుగా రిజర్వాయర్ కనీస నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇప్పటికే రిజర్వాయర్ తలుపులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో వర్షకాలంలో నీరు నిల్వ ఉండడం లేదు. నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఏటా రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నా.. గత వైసీపీ ప్రభుత్వం చలించలేదు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో రిజర్వాయర్ అధ్వానంగా మారింది. మొత్తంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా 211 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ ఖరీఫ్‌లోగా పనులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గత ఐదేళ్లూ పట్టించుకోలే..
గత ఐదేళ్లుగా రిజర్వాయర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. తలుపులు మరమ్మతులకు గురైన విషయాన్ని ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేశాం. అయినా ఎవరూ స్పందించలేదు. వరుణుడిపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాం. రిజర్వాయర్ తలుపులను బాగు చేసి, కాలువల్లో పూడికలు తీసి.. పొలాలకు సక్రమంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలి.
- బి.పార్థసారథిరావు, అధ్యక్షుడు, నూలుగెడ్డ నీటి వినియోగదారుల సంఘం
=======================================
ప్రతిపాదనలు పంపించాం..
కురుపాం పరిధిలో మినీ రిజర్వాయర్ మరమ్మతులు, కాలువల్లో పూడికతీత, చెరువుల అభివృద్ధికి ఓఎన్‌ఎం కింద ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం.
- భావన, జేఈ ఇరిగేషన్, కురుపాం