a Path Can Be Shown! దృష్టి సారించి.. ‘దారి’ చూపితే!
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:42 AM
With Focus and Guidance, a Path Can Be Shown! గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం.. జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల్లో కొన్ని రహదారులకు శాపంగా మారింది. నిర్మాణం మాటెలా ఉన్నా.. కనీసం మరమ్మతులకు నోచుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనుసంధాన రహదారుల పరిస్థితి సరేసరి. రాళ్లు తేలి.. బురదమయంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిశిఖర గ్రామాలకు మంజూరైన తాత్కాలిక రోడ్లపైనా వైసీపీ సర్కారు దృష్టి సారించలేదు. దీంతో గిరిబిడ్డలకు నడకయాతన తప్పడం లేదు.
నేటికీ మోక్షం కలగక.. ఇక్కట్లు తీరక..
రాళ్లు తేలి.. బురదమయంగా దర్శనమిస్తున్న వైనం
గిరిశిఖర గ్రామాల్లో పరిస్థితి సరేసరి..
ఇబ్బందుల్లో మన్యం వాసులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం.. జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల్లో కొన్ని రహదారులకు శాపంగా మారింది. నిర్మాణం మాటెలా ఉన్నా.. కనీసం మరమ్మతులకు నోచుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనుసంధాన రహదారుల పరిస్థితి సరేసరి. రాళ్లు తేలి.. బురదమయంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిశిఖర గ్రామాలకు మంజూరైన తాత్కాలిక రోడ్లపైనా వైసీపీ సర్కారు దృష్టి సారించలేదు. దీంతో గిరిబిడ్డలకు నడకయాతన తప్పడం లేదు. మొత్తంగా మన్యంవాసులకు రోడ్డు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణ బాధ్యత కూటమి ప్రభుత్వం పడింది. ఇప్పటికే పలు రహదారుల పనులకు భారీగా నిధులు మంజూరు చేసింది. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాఽధాన్యం ఇస్తోంది. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులను కూడా మంజూరు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ పెంచి చురుగ్గా పనులు జరిగేలా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
======================================
కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా..
పార్వతీపురం, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డంపింగ్‌యార్డు నుంచి కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం, ఒడిశా రాష్ట్రం రాయగడ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట గుంతల్లో వాహనాలు దిగబడిపోతున్నాయి. మరికొన్ని మరమ్మతులకు గురవుతున్నాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రయాణికులు బెంబేలెత్తి పోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ మార్గంపై పూర్తిగా దృష్టి సారించలేదు. ఫలితంగా రెండు రాష్ర్టాల వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం కొమరాడ మండలంలో కూనేరు రహదారి మరమ్మతుల కోసం రూ. కోటీ 50 లక్షలు మంజూరు చేసింది. అదనంగా మరో రూ.4 కోట్ల వరకూ కేటాయించినట్లు సమాచారం. దీంతో చురుగ్గా పనులు చేపడు తున్నా.. భారీ వాహనాల రాకపోకల వల్ల మళ్లీ రోడ్డు యథాస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణను వివరణ కోరగా.. ‘రూ.కోటి 50 లక్షలతో కూనేరు అంతర్రాష్ట్ర రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నాం. ఈ పనులకు మరో రూ.4 కోట్లు మంజూ రైన మాట వాస్తవమే. ఈ నిధులతో అవసరమైన చోట పనులు చేపడతాం.’ అని తెలిపారు.
అడుగుకో గుంత
మక్కువ రూరల్: ఏళ్లు గడుస్తున్నా.. మక్కువ-సాలూరు రహదారి నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. దీంతో రెండు మండలాల్లో 50గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఐఎన్‌డీబీ కింద సాలూరు నుంచి మక్కువ వంతెన వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.56 కోట్లు మంజూరు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ రోడ్డు పనులను మరో సబ్ కాంట్రాక్టరకు అప్పగించగా.. కొన్ని కల్వర్టులు, కొంతమేర రోడ్డుపనులు చేపట్టారు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మారింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పన్నులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరోవైపు రోడ్డు రాళ్ల తేలి.. భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. మక్కువ నుంచి సాలూరుకు సాఫీగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ద్విచక్రవాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం సాలూరు నుంచి బాగువలస మీదుగా మక్కువ వరకు బస్సులు నడుపుతున్నారు. ఏదేమైనా రెండు మండలాల ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీరు విజయకుమార్‌ను వివరణ కోరగా.. ‘ ఇప్పటివరకు ఈ మార్గంలో 15 కల్వర్టులు, నాలుగు చిన్నవంతెనల నిర్మాణం పూర్తయింది. బాగువలస నుంచి పాయకపాడు వరకు మెటల్ పనులు పూర్తయ్యాయి. రెండు వరుసల రోడ్డు నిర్మా ణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.56కోట్లు మంజూరయయ్యాయి. అయితే వైసీపీ సర్కారు హయాంలో సకాలంలో బిల్లులు చెల్లించనందున పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రాగానే రూ.4.88కోట్ల వరకూ బిల్లులు చెల్లించింది. ఈ రోడ్డు పనుల పూర్తికి రూ.33.10.కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరవగానే నిర్మాణం పునఃప్రారంభిస్తాం. ’ అని తెలిపారు.
ఆ గిరిజన గ్రామాలకు దారేదీ?
భామిని, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): భామిని నుంచి తివ్వకొండపై ఉన్న కోటకొండ, కోసింగూడ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. దీంతో గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. డోకులగూడ, మూలగూడ, లోయగూడ, నడిమగూడ తదితర గిరిజన గ్రామాలకు మెటల్‌రోడ్డు వేసి విడిచిపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక రోడ్లు నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదు. దీంతో ఆయా రోడ్లపై రాళ్లు తేలిపోవడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బొడ్డగూడ నుంచి యాతంగూడ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మణిగ గ్రామం నుంచి కోటకొండ వరకు లింకు రోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఐదు నెలలుగా నిలిచిన పనులు
సీతంపేట రూరల్, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): సోమగండి గ్రామంలో సుమారు 600 మీటర్ల సీసీ రహదారి నిర్మాణానికి ఈ ఏడాది ఉపాధిహామీ పథకంలో భాగంగా సుమారు రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈఏడాది మార్చి నెలలో వాటి పనులు ప్రారంభించారు. సోమగండి గ్రామ సచివాలయం నుంచి పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి వరకు రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే సుమారు 110మీటర్ల వరకు మాత్రమే రోడ్డు పనులు చేపట్టారు. గడిచిన ఐదు నెలలుగా పనులు జరగడం లేదు. దీంతో ఈ ప్రాంత గిరిజనులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. సోమగండి గ్రామం మీదుగా అక్కన్నగూడ, రాజన్నగూడ తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై టీడబ్ల్యూ ఈఈ కుమార్‌ను వివరణ కోరగా.. ‘సోమగండి రహదారి నిర్మాణం సగంలో నిలిచిపోయిన మాట వాస్తవమే. అయితే వర్షాలు కురవడం, పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో ఇలాంటి రహదారుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం.’ అని చెప్పారు.
లింక్ రోడ్లు ఇలా..
గరుగుబిల్లి, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): రావివలస నుంచి వీరఘట్టం మండలం కంబర, జియ్యమ్మ వలసకు వెళ్లేందుకు వీలుగా లింక్ రహదారి ఏర్పాటు చేశారు. ఏడాది పాటుగా ఉపాధిలో పనులు నిర్వహించినా.. ఆ తర్వాత ఈ రోడ్డు యథాస్థితికి చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. పెదగుడబ పంచాయతీ నుంచి రాయిం దొరవలస, సన్యాసిరాజుపేట గ్రామాలకు ఈ మార్గమే శరణ్యం. గోతుల్లో నీరు చేరగా, రహదారికి ఇరువైపులా చెరువు, పంట పొలాలు ఉన్నాయి. ప్రయాణికులు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ఇక అంతే సంగతి. నేరుగా ఆసుపత్రిలో చేరాల్సిందే. కొంకడివరం, గరుగుబిల్లి-బీవీ పురం, రావుపల్లి- కొత్తూరు, చిలకాం, గొట్టివలస - సాంబన్నవలస, మరుపెంట, శివ్వాం నుంచి సీమలవానివలసతో పాటు పలు గ్రామాల లింక్ రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
- జియ్యమ్మవలస: పెదబుడ్డిడి నుంచి వీరఘట్టం మండలం దశమంతపురం రోడ్డు, పిప్పలభద్ర నుంచి గెడ్డతిరువాడ , కుదమ పంచాయతీ గంగరాజపురం గదబవలస నుంచి గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం వరకు ఉన్న రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక రహదారులు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. రాళ్లు తేలి గోతులతో బురదమయంగా మారిన రోడ్లతో గ్రామీణ ప్రాంతవాసులు నిత్యం నరకం చూస్తున్నారు.
- పార్వతీపురం రూరల్: వెంకంపేట గోలీల నుంచి ఎంఆర్‌నగరం వరకు వెళ్లే రహదారిలో ప్రతి అడుగుకు సుమారు నాలుగు గోతులు దర్శనమిస్తున్నాయి. తూతూమంత్రంగానే మరమ్మతులు చేపడుతుండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. లక్ష్మీనారాయణపురం, చొక్కాపు వానివలస తదితర రహదారుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.