ఉంచుతారా?.. పంపిస్తారా?
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:28 AM
సీతంపేట ఐటీడీఏ రెగ్యులర్ పీవోగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
- సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో బదిలీపై ఉత్కంఠ
- ఇంతవరకు యశ్వంత్‌కుమార్‌రెడ్డికి పోస్టింగ్ ఇవ్వని వైనం
- రెగ్యులర్ పీవోగా ఆయనకే బాధ్యతలు?
- ఏక్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం
సీతంపేట రూరల్,ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ రెగ్యులర్ పీవోగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. పాలకొండ సబ్‌కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌లో ఐటీడీఏ పీవోగా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. సుమారు 11నెలల పాటు సబ్‌కలెక్టర్‌గా, ఇన్‌చార్జి పీవోగా విధులు నిర్వహించి తనదైన శైలిలో గిరిజన ప్రాంత అభివృద్థికి చర్యలు తీసుకున్నారు. ఈనెల 4న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడుగురు సబ్‌కలెక్టర్లను బదిలీ చేసింది. పాతవారి స్థానంలో కొత్తగా ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లగా నియమిస్తూ జీవో జారీచేసింది. పాలకొండ సబ్‌కలెక్టర్‌గా 2022బ్యాచ్‌కు చెందిన పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌ను నియమించింది. ఆయన ఈనెల 11న పాలకొండ సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. పాలకొండ సబ్‌కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జగన్నాథ్‌కు కూడా సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో బాధ్యతలను అప్పగించలేదు. దీంతో సీతంపేట ఐటీడీఏ పీవోగా ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తుందా? లేక యశ్వంత్‌కుమార్‌రెడ్డినే రెగ్యులర్ పీవోగా కొనసాగిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
రెగ్యులర్ పీవోల నియామకానికే మొగ్గు?
పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలను నియమించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి పైగా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చిన ఐటీడీఏలకు ఎట్టకేలకు రెగ్యులర్ ఐఏఎస్ అధికారులను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించనున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల్లో ఇన్‌చార్జిల పాలనకు స్వస్తిపలికి రెగ్యులర్ పీవోలుగా ఐఏఎస్‌లను నియమించి గిరిజనాభివృద్థికి బాటలు వేయాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఇంతవరకు రెగ్యులర్ పీవోలను నియమించలేదని విశ్వాసనీయ వర్గాల సమాచారం. రెగ్యులర్ పీవోల నియామకానికి సంబంధించి మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనున్నట్లు బోగట్టా. ఇదే జరిగితే గిరిజన ప్రాంతాలు మరింతగా అభివృద్థి చెందుతాయని గిరిజన సంఘాల నాయకులు, ఆదివాసీలు విశ్వసిస్తున్నారు.
గిరిజన సమస్యలపై అవగాహన
సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా సుమారు 11నెలల పాటు పనిచేసిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంత గిరిజన సమస్యలపై కొంతవరకు అవగాహన పెంచుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులను పరిష్కరించడంతో పాటు గిరిజన విద్య, మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దోమకాట్లకు గురికాకుండా ఉండేందుకు సీఎస్‌ఆర్ (కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధులు సుమారు రూ.10లక్షలు వెచ్చించి కిటికీలకు మెస్‌లను ఏర్పాటు చేయించారు. పూతికవలస, ముత్యాలు ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులకు పరుపులు(మేట్రిస్)అందజేశారు. విశాఖపట్నం కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడి సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సికెల్‌సెల్ ఎనీమియా రోగుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయించారు. వ్యాధిగ్రస్తులకు స్థానిక వైటీసీ కేంద్రంలో సికెల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ రోగులకు రూ.10వేలు పెన్షన్ ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా చూశారు. గిరిజన విద్యా ప్రమాణాల మెరుగుకు తనవంతు కృషిచేసి, ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే సీతంపేట ఐటీడీఏ ప్రథమస్థానంలో నిలిచేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారులు, వరద గోడల నిర్మాణాలు చేపట్టారు. భామిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు 3ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించారు. ఆడలీ వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో పర్యాటకులు వరుస ప్రమాదాలకు గురౌతున్న నేపధ్యంలో రూ.1.20కోట్లతో రక్షణ చర్యలు చేపట్టారు.
యశ్వంత్‌కుమార్‌రెడ్డికే అవకాశాలు?
సీతంపేట ఇన్‌చార్జి పీవోగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అందించిన పాలనపై నాలుగు రోజుల కిందట ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టింది. పాలనపరమైన సంస్కరణలో భాగంగా ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మండలస్థాయి అధికారులకు కూడా ఐవీఆర్‌ఎస్ సర్వే కాల్స్ వచ్చాయి. యశ్వంత్‌కుమార్‌రెడ్డి పాలన ఎలా ఉంది? బాగుంటే 1నొక్కండి, బాగోలేదంటే 2నొక్కండి అంటూ ఫోన్స్ కాల్స్ కిందిస్థాయి అధికారులకు వచ్చాయి. ఈ సర్వే యశ్వంత్‌కుమార్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ సీతంపేట ఐటీడీఏ పీవోగా యశ్వంత్‌కుమార్‌రెడ్డిని రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఏక్షణమైనా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.