Goal లక్ష్యాన్ని చేరుకుంటారా?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:28 AM
Will You Achieve the Goal? జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. గత ఏడాది పెండింగ్ బకాయిలతో పాటు ఈ ఏడాది పన్ను లక్ష్యాలు చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో 18 రోజులే మిగిలి ఉండడంతో ఏ మేరకు వసూలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లకు చర్యలు
పార్వతీపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. గత ఏడాది పెండింగ్ బకాయిలతో పాటు ఈ ఏడాది పన్ను లక్ష్యాలు చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో 18 రోజులే మిగిలి ఉండడంతో ఏ మేరకు వసూలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఇంటిపన్ను లక్ష్యం రూ.5.51 కోట్లు కాగా ఈ నెల 11 నాటికి రూ.3.75 కోట్లు వసూలైంది. కుళాయి పన్ను రూ.3.13 కోట్లకు గాను కేవలం రూ.32 లక్షలు మాత్రమే రాబట్టారు. ఖాళీ స్థలాలకు సంబంధించి రూ.56 లక్షలకు రూ.23 లక్షలు మాత్రమే వసూలైంది. సాలూరు పురపాలక సంఘంలో ఈ ఏడాది ఆస్తి పన్ను లక్ష్యం రూ.2.73 కోట్లు కాగా రూ.1.66 కోట్లు వసూలు చేశారు. నీటి పన్ను రూ.1.40 కోట్లు గాను రూ.26 లక్షలు, ఖాళీ స్థలాలకు సంబంధించి సుమారు రూ.88 లక్షలు లక్ష్యంగా కాగా కేవలం రూ.13 లక్షలు మాత్రమే రాబట్టారు. పాలకొండ నగర పంచాయతీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్థి పన్ను లక్ష్యం కాగా రూ.1.64 కోట్లు వసూలు చేశారు. ప్రభుత్వ ఆస్తి పన్నుకు సంబంధించి రూ.44 లక్షలకు గాను రూ.5 లక్షలు మాత్రమే రాబట్టారు. ఖాళీ స్థలాలకు సంబంధించి సుమారు రూ.14 లక్షలకు గాను రూ.6 లక్షలే వసూలు చేశారు.