Share News

Will Traffic Flow Smoothly? సాఫీగా రాకపోకలు సాగేనా?

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:51 PM

Will Traffic Flow Smoothly? జిల్లాలో పలు ప్రధాన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కాగా ఈ పనులు పూర్తయితే జిల్లావాసులకు రహదారి కష్టాలు తప్పనున్నాయి.

Will Traffic Flow Smoothly? సాఫీగా రాకపోకలు సాగేనా?
పార్వతీపురం మండలంలో ఎంఆర్‌ నగరం రహదారి ఇలా..

  • పర్యవేక్షించాలని సీఎం ఆదేశాలు

  • ఇప్పటికైనా అధికారుల తీరు మారేనా?

పార్వతీపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ప్రధాన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కాగా ఈ పనులు పూర్తయితే జిల్లావాసులకు రహదారి కష్టాలు తప్పనున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం రహదారులపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిర్మాణం మాటెలా ఉన్నా.. కనీసం మరమ్మతులు కూడా చేయించలేకపోయింది. దీంతో అడుగుకో గుంతతో రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో కొన్ని రహదారులకు మరమ్మతులు చేపట్టింది. మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. అయితే టెండర్లు ఖరారు కాకపోవడంతో కొన్ని రహదారుల పనులు నేటికీ ప్రారంభం కాలేదు. రాయగడ రోడ్డు నుంచి కూనేరు పనులే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మరమ్మతులు చేపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. దీనివల్ల వాహనదారులు, ప్రజలకు దారి కష్టాలు తప్పడం లేదు. అయితే ఇటువంటి రహదారులపై దృష్టి సారించిన కూటమి ప్రభు త్వం డిసెంబరు లోపు మరమ్మతు పనులు పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో సాలూరు నుంచి మక్కువ రోడ్డుకు త్వరలోనే మోక్షం కలగనుంది. పార్వతీపురం మండలంలో వెంకంపేట గోలీల నుంచి ఎంఆర్‌ నగరం రహదారి మరమ్మతు పనులు కూడా చేపట్టనున్నారు. మన్యంలో మరికొన్ని చోట్ల రోడ్డు రూపురేఖలు మారనున్నాయి. అయితే వాటి పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. లేకుంటే మరమ్మతులు చేపట్టిన అనతికాలంలోనే రోడ్డు మళ్లీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:51 PM