Will They Rise or Fall? పెరుగుతాయా.. తగ్గుతాయా?
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:39 PM
Will They Rise or Fall? జిల్లాల పునర్విభజన అంశం సర్వత్రా చర్చనీయాంశ మవుతోంది. జిల్లాల పేర్లు మార్పు.. డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మండలాల సంఖ్య పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
అదనంగా మన్యం జిల్లాకు మండలాలు కలుస్తాయో.. లేదో?
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో అనేక సందేహాలు
పార్వతీపురం, జూలై23 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన అంశం సర్వత్రా చర్చనీయాంశ మవుతోంది. జిల్లాల పేర్లు మార్పు.. డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మండలాల సంఖ్య పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టినప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కూడా లేని పరిస్థితి. కాగా జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాల పేర్లు, వాటి సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చాలని కోరారు. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రానికి ప్రజలు ఎంత దూరంలో ఉన్నారు? వారికి అందుతున్న సేవలు తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ఒక నివేదిక అందించనుంది. దానిని పరిశీలించిన తర్వాతే జిల్లా స్వరూపం ఏ విధంగా మారుతుందున్నది తెలిసే అవకాశం ఉంది.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజక వర్గాలతో పాటు 15 మండలాలతో గత ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేసింది. కాగా సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెంటాడ మండలాన్ని కొన్ని రాజకీయ శక్తుల ప్రభావంతో విజయనగరం జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఏడు, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు అదనంగా మరికొన్ని నియోజకవర్గాలను చేర్చాల్సిన పరిస్థితి ఉంది. బొబ్బిలి ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో దానిని తప్పనిసరిగా పార్వతీపురం మన్యం జిల్లా విలీనం చేసే పరిస్థితి ఉంది. మెంటాడ మండలం కూడా మన్యం జిల్లాలో ఉంచనున్నారు. భామిని మండలం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నప్ప టికీ పాలకొండ నియోజకవర్గానికి సమీపంలోనే ఉంది. దీంతో అది యథావిధిగా మన్యం జిల్లాలో కొనసాగనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.