Will They Resolve It? స్పందిస్తారని.. పరిష్కరిస్తారని!
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:43 PM
Will They Respond… Will They Resolve It? టెన్త్, ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నా.. విద్యాశాఖను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. మౌలిక వసతులు, భవనాల కొరతతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖను సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది.
పాఠశాలలను మాత్రం వేధిస్తున్న భవనాల కొరత
గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయం
నేటికీ చెట్ల కిందే చదువులు
క్రీడా మైదానాలూ కరువే..
ఉన్నత విద్యకు అవస్థలు
ఇన్‌చార్జి పాలనలోనే విద్యాశాఖ
నేడు జిల్లాకు మంత్రి నారా లోకేశ్ రాక
భామినిలో పార్టీ శ్రేణులతో సమావేశం
రేపు నిర్వహించనున్న మెగా పీటీఎంలో సీఎంతో కలిసి హాజరు
పార్వతీపురం, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): టెన్త్, ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నా.. విద్యాశాఖను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. మౌలిక వసతులు, భవనాల కొరతతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖను సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ఇన్‌చార్జిలతోనే నెట్టుకురావల్సి వస్తోంది. పోస్టులు మంజూరు కాక ఉన్న వారిపై పనిభారం పడుతోంది. గురువారం జిల్లాకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
ఇదీ పరిస్థితి..
- జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతున్నా.. పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖాధికారి లేరు. ఐటీడీఏ డిప్యూటీ డీఈవోలు లేదా ఎంఈవోలు, ఇన్‌చార్జి డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత ఐటీడీఏ డిప్యూటీ డీఈవోగా నియామకమైన ప్రేమ్‌కుమార్ ఇన్‌చార్జి డీఈవోగా ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. డైట్ కళాశాలలో విధులు నిర్వహించిన పగడాలమ్మ, నాయుడు కూడా ఇన్‌చార్జిల జిల్లా విద్యాశాఖాధికారులుగా కొనసాగారు. తాజాగా సాలూరు ఎంఈవో రాజ్‌కుమార్ ఇన్‌చార్జి డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.
- జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయి భవనాలు లేవు. గిరిజన ప్రాంతాల్లో అయితే పూరిపాకలు, రేకుల షెడ్లు , చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల శిథిల భవనాల్లో పాఠాలు బోధిస్తున్నారు. వర్షం కురిస్తే విద్యార్థులు ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది.
- జిల్లాలో మొత్తంగా 1586 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 100 బడులకు పక్కా భవనాలు లేవు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
- విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. అయితే జిల్లాలో పలు పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవు. దీంతో వారి ఆటలకు ఆటంకం ఏర్పడుతోంది.
- కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ జిల్లాలో సమస్యలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు. మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆహ్లాదకర వాతావ రణంలో పిల్లలు విద్యనభ్యసించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫలితాలు ఇలా..
పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడుసార్లు మన్యం జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్‌లోనూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. వారికి ఉన్నత విద్యకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. అదే విధంగా గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు నియామ కానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పార్టీ శ్రేణులతో సమావేశానికి సర్వం సిద్ధం
మండల కేంద్రం సమీపంలో లివిరి సెంటర్‌లో విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి బుధవారం తెలిపారు. కార్య కర్తలు, పార్టీ బీఎల్‌వోలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు కార్యకర్తలు సుమారు 700 మంది హాజరుకానున్నారని వెల్లడించారు.