Share News

Will They Resolve It? పరిష్కరిస్తారా?

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:59 PM

Will They Resolve It? పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్ల సమస్యలకు మోక్షమెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం.. 30 వార్డుల్లో ప్రజలకు శాపంగా మారింది.

Will They Resolve It?  పరిష్కరిస్తారా?
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • పడకేసిన పారిశుధ్యం.. అధ్వానంగా వీధిలైట్ల నిర్వహణ

  • కొన్నాళ్లుగా పట్టణవాసులకు తప్పని ఇబ్బందులు

  • నేడు నూతన కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

  • పై సమస్యలపై దృష్టి సారించాలని విన్నపం

పార్వతీపురం టౌన్‌, నవంబరు9(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్ల సమస్యలకు మోక్షమెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం.. 30 వార్డుల్లో ప్రజలకు శాపంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా పై మూడు సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. పట్టణవాసులు నానా అవస్థలు పడు తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన కమిషనర్‌ కె.కిషోర్‌కుమార్‌ ఆయా సమస్యలపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం మున్సిపాల్టీగా ఏర్పడి సుమారు 65 ఏళ్లు పూర్తి కావస్తోంది. గ్రేడ్‌-1 పురపాలక సంఘంగా ఏర్పడి 25 ఏళ్లు అవుతోంది. అయినా తాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి. సుమారు 58 ఏళ్ల కిందట గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి పార్వతీపురం పట్టణానికి నీటి సరఫరా కోసం పథకాన్ని ప్రారంభించారు. అయితే అప్పుడు వేసిన పైప్‌లైన్‌ పూర్తిగా పాడవడం, లీకులు ఇతరత్రా సమస్యలతో తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అన్ని కాలాల్లోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోది. వేసవిలో వారం రోజులకొకసారి, శీతాకాలంలో నాలుగు రోజులకు , వర్షాకాలంలో అయితే పూర్తిగా బురదనీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజారోగ్యం దెబ్బతింటోంది.

- జిల్లా కేంద్రంలో అనధికారికంగా 80 వేలకు పైగా జనాభా ఉంటారనేది వాస్తవం. పట్టణ విస్తరణ శరవేగంగా జరగడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ కాలనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జనాభా సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే పారిశుధ్య నిర్వహణ అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండగా.. కాలువలు పూడికలతో నిండాయి. మున్సిపాల్టీలో శాశ్వత, కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు 130 మందే ఉండడంతో వారిపై పనిభారం పెరుగుతోంది.

- పట్టణంలో వీధి లైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. సుమారు 15 ఏళ్ల కిందట ప్రైవేట్‌ వ్యక్తులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే సెంటర్‌ లైటింగ్‌, వీధి లైట్ల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో దీపాలు ఎప్పుడు వెలుగుతాయే తెలియని పరిస్థితి. మరోవైపు ప్రైవేట్‌ సంస్థకు మున్సిపాల్టీ సుమారు రూ.20 లక్షల వరకు బకాయి పడింది. లైటింగ్‌ నిర్వహణ చేపడుతున్న కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. మొత్తంగా రాత్రి వేళల్లో పట్టణవాసులకు అవస్థలు తప్పడం లేదు.

Updated Date - Nov 09 , 2025 | 11:59 PM