Will They Support? గుర్తిస్తారా.. ఆదుకుంటారా?
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:26 AM
Will They Recognize… Will They Support? గిరిశిఖర గ్రామాల్లోని పలు పంచాయతీల్లో కుష్ఠు వ్యాధిగ్రస్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి ఎటువంటి వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో తోటి గిరిజనుల సాయంతోనే కాలం నెట్టుకొస్తున్నారు.
దయనీయ స్థితిలో జీవనం
అందని వైద్య సేవలు, సంక్షేమ పథకాలు
ప్రతినెలా ఆసుపత్రులకు చేరుకునేందుకు అవస్థలు
సాయం కోసం ఎదురుచూపు
కురుపాం రూరల్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లోని పలు పంచాయతీల్లో కుష్ఠు వ్యాధిగ్రస్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి ఎటువంటి వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో తోటి గిరిజనుల సాయంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. తిత్తిరి పంచాయతీలో ఎగువ ఆవిరి, గూనిగూడ, ఎగువ కీడవాయి, కాగుమానుగూడ, పొడి పంచాతీయ భారతంగి తదితర గిరి శిఖర గ్రామాల్లో అధికంగానే వ్యాధిగ్రస్థులు ఉన్నారు. వారంతా గ్రామాలకు దూరంగా ఉంటున్నారు. సొంత ఖర్చులతోనే విజయనగరం, పార్వతీపురం, కురుపాం, నీలకంఠా పురం ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అయితే ప్రతినెలా వ్యయ ప్రయాసలకు గురై ఆసుపత్రులకు చేరుకోవాల్సి వస్తోంది. కనీసం డ్రెస్సింగ్ చేసుకునేందుకు అవసరమైన మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోజురోజుకూ వ్యాధి ముదురడంతో కొంతమంది దివ్యాంగులుగా మారుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉన్నా వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం జిల్లాలో రోగుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఈ వ్యాధిగ్రస్థులకు అవసరమైన వైద్యం, భృతి అందించాల్సి ఉంది. ప్రత్యేక సదుపాయాలు కల్పించి.. పునారావాస కేంద్రాలకు తరలించాలని బాధితులు కోరుతున్నారు.
గుర్తిస్తున్నాం..
జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ఈ నెలాఖరు వరకూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఇప్పటికే వైద్య సిబ్బంది గ్రామాల్లో తిరిగి బాధితులను గుర్తిస్తున్నారు. జిల్లాల్లో 132 మంది వ్యాధిగ్రస్థులు ఉన్నారు. వీరికి ట్రీట్‌మెంట్ కొనసాగుతుంది. అవసరమైన వారికి సర్జరీలు చేయించి డిశ్చార్జి సమయంలో మందులతోపాటు రూ.12 వేలు ఇస్తున్నాం. వ్యాధి లక్షణాలపై విస్తృత ప్రచారం చేస్తున్నాం.
- వినోద్‌కుమార్, జిల్లా లెప్రసీ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్