Target? లక్ష్యం చేరుకుంటారా?
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:22 AM
Will They Reach the Target? జిల్లాలో ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని అధికా రులు భావిస్తున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇవ్వలేదు. దీంతో వాటి కోసం అధికారులు ఎదురుచూడాల్సి వస్తోంది.
ఇప్పటివరకు మిల్లర్లు ఇచ్చిన బీజీ రూ.3.46కోట్లు
ధాన్యం కొనుగోలుపై ప్రభావం
పార్వతీపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని అధికా రులు భావిస్తున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇవ్వలేదు. దీంతో వాటి కోసం అధికారులు ఎదురుచూడాల్సి వస్తోంది. గత ఏడాది రూ.114 కోట్ల వరకు మిల్లర్లు బీజీలు సమర్పించారు. ఈ సంవత్సరం సుమారు రూ.200 కోట్ల బ్యాంకు గ్యారెంటీలు అందించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మిల్లర్లు కేవలం రూ.3.46 కోట్ల వరకే బీజీలు ఇచ్చారు. జిల్లాలో 104 రైస్ మిల్లులు ఉండగా వాటిల్లో ఆరు రైస్ మిల్లుల నుంచి మాత్రమే బీజీలు వచ్చాయి. మిగిలిన వారు బ్యాంకు గ్యారెంటీలు అందించక పోవడంతో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగడం లేదని చెప్పొచ్చు. ఈ ఏడాది జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 89 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కాగా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం సరఫరా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో బీజీలు అందితేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల్లో తుఫాన్ భయం నెలకొంది. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాగా ఇప్పటికే కొంత మంది తడి ధాన్యాన్ని ఉభయ గోదావారి జిల్లాలకు తరలిస్తున్నారు. దీనిపై జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ‘జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తాం. ఇప్పటివరకు 89 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మిల్లర్ల నుంచి రూ.3.46 కోట్ల వరకు బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు అందాయి. ఇంకా రూ. 200 కోట్ల వరకు బీజీలు రావల్సి ఉంది. ’ అని తెలిపారు.