Share News

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:29 AM

Will They Leave It Like This? గిరిజన ప్రాంతాల్లో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఈ కేంద్రాలు మూతపడే స్థితికి చేరుతున్నాయి. మరోవైపు యంత్ర పరికరాలు కూడా మరమ్మతులకు గురై మూలకు చేరాయి.

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?
సీతంపేటలో మూతపడిన వీడీవీకే

  • పర్యవేక్షణ కరువు

  • పాడైపోయిన యంత్రాలు

  • భారమైన నిర్వహణ

  • మూతపడే స్థితికి కేంద్రాలు

సీతంపేట రూరల్‌, నవంబరు26(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఈ కేంద్రాలు మూతపడే స్థితికి చేరుతున్నాయి. మరోవైపు యంత్ర పరికరాలు కూడా మరమ్మతులకు గురై మూలకు చేరాయి. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి.. గిరిజన మహిళ లను ఆర్థికంగా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011లో కోట్ల వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను ఎస్‌హెచ్‌జీ(సెల్ఫ్‌ ఎంప్లాయి గ్రూప్స్‌)లకు వెలుగు సంస్థకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రస్తుతం వాటి పనితీరు ప్రభుత్వ లక్ష్యాలకు దూరంగా ఉంది. ఎస్‌హెచ్‌జీల నుంచి ఉన్న డిమాండ్‌ మేరకు యంత్రాలు సమకూర్చకపోవడం, గతంలో ఇచ్చిన యంత్ర పరికరాలను బాగు చేయకపోవడంతో వీడీవీకేల పరిస్థితి అధ్వానంగా మారింది.

ఇదీ పరిస్థితి..

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20 ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌(టీఎస్‌పీ)మండలాల్లో 121వీడీవీకేలు ఉన్నాయి. ఇక సీతంపేట మండలంలో 35వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. నిర్వహణ భారంతో అధికశాతం వీడీవీకేలు తెరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చేసేది లేక ఎస్‌హెచ్‌జీ సభ్యులు కూడా వీటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. కొన్ని కేంద్రాలకు జీడిపిక్కలు ప్రోససింగ్‌ చేసే యంత్రాలు, మరికొన్నింటికి బ్రూమ్‌ స్టిక్స్‌ (కొండచీపుర్లు)కటింగ్‌ యంత్రాలను పంపిణీ చేశారు. అయితే ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం, సభ్యులకు వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో చాలా కేంద్రాల్లో ఇవి మూలనపడ్డాయి. సీతంపేట ఐటీడీఏకు సమీపంలో ఉన్న వీడీవీకేకు 2021లో జీడిపప్పు ప్రోససింగ్‌ యూనిట్‌, చింతపండు కేక్‌ తయారీ, పసుపు శుద్ధిచేసి ప్యాకింగ్‌ చేసే యంత్రాలను అందజేశారు. అయితే అవి కూడా నిరుపయోగంగానే మారాయి. అగరబత్తీల యూనిట్‌ మాత్రమే ఇక్కడ నడుస్తోంది. ఐటీడీఏకు సమీపంలో ఉన్న వీడీవీకే పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుందో ఐటీడీఏ, వెలుగు అధికారులకే తెలియాలి. ఈ ఏడాది ఐటీడీఏ ద్వారా వీడీవీకేలకు అందజేసిన పిండిమిల్లులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇక మెళియాపుట్టిలో వీడీవీకే పరిస్థితి దయనీయంగానే ఉంది. యంత్ర పరికరాలు మరమ్మతులకు గురై ఆరుబయట దర్శనమిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏడు ట్రైబల్‌ ప్రాజెక్ట్‌ మానటరింగ్‌ యూనిట్‌ మండలాల్లో ఉన్న 68వీడివీకేల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాటిల్లో ఉన్న యంత్ర పరికరాలు చిన్నపాటి మరమ్మతులకు గురైన పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో లక్షల విలువచేసే పరికరాలు మూలకు చేరుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే విజయవాడ నుంచి టెక్నీషియన్‌ రావాల్సి ఉందని తెలిసింది.

పర్యవేక్షణ కరువై..

వీడీవీకేలను వెలుగు డీపీఎం స్థాయి అధికారి సందర్శించకపోవడం, క్షేత్రస్థాయిలో ఉన్న వెలుగు సీసీలతో సమన్వయం చేసుకోకపోవడంతో కేంద్రాల నిర్వహణ గాడి తప్పిందని చెప్పొచ్చు. వీడీవీకేల పనితీరుపై సమీక్షల నిర్వహించిన సమయాల్లో లెక్కలు చెప్పడం వెలుగు సిబ్బందికి పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయిలో మాత్రం వీటి పరిస్థితి భిన్నంగా ఉంది.

మార్కెటింగ్‌ లేక..

వీడీవీకేల్లో గిరిజన మహిళలు తయారుచేసిన అటవీ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ మార్కెటింగ్‌ సదుపాయం లేదు. పెద్ద మొత్తంలో ఏవిధంగా విక్రయాలు చేయాలనే దానిపై ఎస్‌హెచ్‌జీలకు అవగాహన లేకుండా పోయింది. వెలుగు సిబ్బంది కూడా ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

డీపీఎం ఏమన్నారంటే..

‘వీడీవీకేల నిర్వహణ బాగానే ఉంది. అక్కడక్కడా యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగు చేయిస్తాం. వీడివీకేల్లో మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం.’ అని వెలుగు డీపీఎం ఆర్‌వీ రమణ తెలిపారు.

Updated Date - Nov 27 , 2025 | 12:29 AM