devotees’ safety? భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తారా?
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:24 PM
Will they ensure devotees’ safety? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో మన్యంలో ఆలయాల భద్రత అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తపై ఎటువంటి దురదృష్టకర ఘటనలు సంభవించ కుండా చూడాల్సి ఉంది. భద్రతపై భక్తులకు భరోసా కల్పించాల్సి ఉంది.
జిల్లాలో కొన్నిచోట్ల అంతంతమాత్రంగానే వసతులు
సమన్వయంతో పనిచేస్తే మేలు
ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం
ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు
రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు
పార్వతీపురం, నవంబరు2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో మన్యంలో ఆలయాల భద్రత అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తపై ఎటువంటి దురదృష్టకర ఘటనలు సంభవించ కుండా చూడాల్సి ఉంది. భద్రతపై భక్తులకు భరోసా కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఉన్న పరిస్థితిపై ఇప్పటికే ప్రభుత్వం ఆరా తీసింది. ఏయే ఆలయాల్లో ఎప్పుడెప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు? ఎంత మంది భక్తులు వస్తారు? క్యూలైన్ల పరిస్థితి, దర్శన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయనే విషయాలను సేకరించింది. అంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాయంత్రాంగం భద్రతా చర్యలు చేపడుతుంది.
ఇదీ పరిస్థితి..
కార్తీకం, ఇతర సందర్భాలలో పార్వతీపురం మండలం అడ్డాపుశీల కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద గుహాలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. శివలింగం దర్శనం, ప్రత్యేక పూజల కోసం పోటీపడుతుంటారు. కొమరాడ మండలం గుంప సోమేశ్వరాలయానికి కార్తీక సోమవారాలు, మహా శివర్రాతి సమయాల్లో వేలాదిగా జనం తరలివస్తుంటారు. పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద ఈ నెల 17న పండుగ వాతావరణంలో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. అన్న సమారాధన కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది హాజరుకానున్నారు. సాలూరు పంచముఖేశ్వర ఆలయం వద్ద ఈనెల 5న నిర్వహించే జ్వాలాతోరణం కార్యక్రమానికి సుమారు ఐదువేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. బలిజిపేటలో నీలకంఠేశ్వర స్వామి ఆలయం, నారాయణపురం, గలావల్లి గ్రామాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు, సీతానగరం మండలంలో వేణుగోపాలస్వామి, సువర్ణముఖే శ్వర ఆలయాలు, భామిని మండలంలో పెద్దదిమిలిలో ఉన్న ఎండల మల్లికార్జునస్వామి ఆలయాలకు కూడా ఈ కార్తీకంలో భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా ఆలయాల్లో దేవదాయ శాఖాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి.
ఇలా చేస్తే మేలు..
భక్తుల భద్రతకు పెద్దపీట వేసి ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సాఫీగా దైవ దర్శనమయ్యేలా చేయడంతో పాటు క్యూలైన్‌లో ఉన్నవారికి తాగునీరు, పిల్లలకు పాలు, ఇత రత్రా వసతులు కల్పించాల్సి ఉంది. భక్తుల మధ్య తోపులాట, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవదాయ శాఖాధికారులపై ఉంది. పురాతన ఆలయాలు, గుహాలయాలపై కూడా దృష్టి సారించాలి. అవసరమైతే పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి.. ఏయే సందర్భాలలో ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు.. కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించాల్సి ఉంది. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవదాయశాఖాధికారులు మరింత అప్రమత్తం కావాలని జిల్లావాసులు కోరుతున్నారు.
తోటపల్లిలో ఏర్పాట్లు ఇలా..
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. కార్తీకమాసం దృష్ట్యా స్వామివారి దర్శనానికి 20 వేలకు పైగా భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ఖాళీ ప్రాం తంలో టెంట్లు ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి పైగా శ్రీవారి సేవకులు, ట్రస్ట్ సభ్యులు సేవలందించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించారు. నాగావళి నదిలో స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు నెలకొనకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాగునీరు, భోజన సౌకర్యం కల్పించనున్నారు. దేవస్థానం పరిధిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, జల వనరులశాఖ సిబ్బందికి ముందస్తు సమాచారం అందించ నున్నామని ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు.
సాలూరు పంచముఖేశ్వరాలయంలో..
సాలూరు: పట్టణంలోని పంచముఖేశ్వరస్వామి ఆలయం వద్ద ఇప్పటికే క్యూలైన్లు, బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. కార్తీక సోమవారాలు, ఇతర ముఖ్యమైన పర్వదినాలలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. అన్ని ఆలయాల వద్ద సుమారు 20 మంది వరకు పోలీసు బందోబస్తు పెడుతు న్నామన్నారు.
- సాలూరు రూరల్: సాలూరు మండలంలో పారన్నవలస, శివరాంపురం, పాచిపెంట మల్లికార్జునస్వామి ఆలయం, మక్కువలో శాంతేశ్వరం తదితర ఆలయాల వద్ద భద్రత ఏర్పాట్లు చేసినట్టు రూరల్ సీఐ పి.రామకృష్ణ చెప్పారు. భక్తులు కూడా సహకరించాలని కోరారు.
పెద్దదిమిలిలో..
భామిని: కార్తీక రెండో సోమవారం సందర్భంగా పెద్దదిమిలిలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి సుమారు రెండు వేల మంది భక్తులు వస్తారని కమిటీ అంచనా వేస్తోంది. ఈ మేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బత్తిలి ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు.
ఉమారామలింగేశ్వరాలయంలో భారీ గేట్లు
పాలకొండ: పాలకొండ ఉమారామలింగేశ్వరాలయంలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఉమా గోకర్ణేశ్వరస్వామి, సదాశివుని, భీమలింగేశ్వర ఆలయాల్లోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఈవో శివకేశవరావు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
కార్తీకమాసంతో పాటు ఇతర పుణ్యదినాల్లో దేవాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవదాయ శాఖాధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ప్రముఖ ఆలయాల వద్ద ఏర్పాట్లు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి.
- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి
==========================
ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాలో ప్రముఖ ఆలయాలపై పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలి. మూడు వేలు కంటే మించి భక్తులు రద్దీగా ఉన్న ఆలయాల వద్ద తీసుకో వాల్సిన చర్యలపై ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించాలి. ఇందులో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఈవెంట్ ఆర్గనైజర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వాములావ్వాలి. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. సమావేశాలు, బహిరంగ కార్యక్రమాల్లో ఎటువంటి నష్టం జరగకూడదు. జనసమూహం ఉన్న చోట క్యూ లైన్ ఏర్పాటు చేయాలి. ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పోలీస్ సిబ్బందిని నియమించాలి. పార్కింగ్ ప్రాంతాలను దూరంగా ఏర్పాటు చేసి, రద్దీని నియంత్రణకు తగినంత సిబ్బందిని కేటాయించాలి. పోలీస్, రెవెన్యూ, దేవదాయ, ఫైర్‌సర్వీసెస్, వైద్య ఆరోగ్యశాఖల నిర్వాహకులు సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలి.
- ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్